సియోల్(దక్షిణకొరియా): దేశవ్యాప్తంగా అత్యయిక స్థితి(మార్షల్ లా) ప్రకటన నేపథ్యంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కార్యాలయంలో సోదాలకు పోలీసులు సాహసించారు. అయితే అధ్యక్ష కార్యాలయం భద్రతా బలగాలు వెంటనే పోలీసులను అడ్డుకున్నారు. దీంతో యూన్ కార్యాలయ ప్రధాన భవనంలోకి పోలీసులు ప్రవేశించలేకపోయారు. దీంతో పౌర సేవల కార్యాలయాల్లో పోలీసులు తనిఖీలు చేశారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో ఆధిక్యత లేకపోవడంతో ఏ బిల్లును ప్రవేశపెట్టినా విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవడం, పదవి నుంచి వైదొలగాలన్న డిమాండ్లను ఎదుర్కొంటున్న అధ్యక్షుడు యూన్ యోల్ ఇటీవల అనూహ్యంగా ‘మార్షల్ లా’ప్రకటించడం తెల్సిందే. తర్వాత విపక్షాలు పార్లమెంట్‌లో తీర్మానం చేసి ఎమర్జెన్సీని ఎత్తేయడం, అధ్యక్షుడు యూన్ సహా పలువురు దేశద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం అధ్యక్షుడికి సంబంధించిన ఆఫీస్‌లలో పోలీసులు ఆకస్మిక సోదాలు చేశారు. దాడులు జరిగిన సమయంలో అధ్యక్షుడు యూన్ కార్యాలయంలో లేరు. యోన్‌కు సన్నిహితులైన పలువురు అధికారులు రాజీనామా చేశారు.
మాజీ రక్షణ మంత్రి ఆత్మహత్యాయత్నం
‘మార్షల్ లా’విధించడానికి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్‌ను పోలీసులు అరెస్ట్‌చేయగా అరెస్ట్‌పై మనస్తాపంతో ఆయన మంగళవారం రాత్రి జైలు గదిలో ఆత్మహత్యకు ప్రయతి్నంచినట్లు అధికారులు తెలిపారు. మార్షల్ లా విధించాలని సిఫార్సు చేసిన కిమ్‌ను రాజధాని సియోల్‌లో ఆదివారం అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే. మంగళవారం అర్ధరాత్రి అధికారికంగా అరెస్టు వారెంట్ జారీ కాకముందే ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన బాత్రూమ్‌లో ఆత్మహత్యకు ప్రయతి్నంచగా జైలు అధికారులు ఆయనను వెంటనే అడ్డుకున్నారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడానే ఉందని రక్షణ శాఖ శాఖ పార్లమెంట్‌కు తెలిపింది. కిమ్‌పై నేరాభియోగాలు మోపాలా వద్దా అనే దానిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 20 రోజుల్లోపు నిర్ణయం తీసుకోనున్నారు.
మరోసారి అభిశంసన
గత శనివారం అధ్యక్షుడిపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో ప్రధాన విపక్ష డెమొక్రటిక్ పార్టీ మరోసారి అభిశంసన తీర్మానం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. మార్షల్ లా అమలు కోసం పనిచేసిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను దర్యాప్తు అధికారులు బుధవారం అరెస్ట్‌చేశారు. రెండోసారి అభిశంసన ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే ఈ ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను అరెస్ట్‌చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment