న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలపై గతంలో లాగా మరోసారి వివాదం తలెత్తే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. 2000 సంవత్సరంలో జార్జి డబ్లూ బుష్, అల్ గోరే మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌ల మధ్య పునరావతం కావచ్చు. అమెరికా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి రావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ట్రంప్, బైడెన్‌ల మధ్య హోరాహోరీగా సాగుతోన్న ఎన్నికల పోరులో పోస్టల్ బ్యాలెట్ పత్రాలే ఈసారి విజేతను తేల్చనున్నాయి. బ్యాలెట్ పత్రాల వల్ల తాను ఓటమికి గురయిన పక్షంలో సుప్రీం కోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో ట్రంప్ ఉన్నారు. (చదవండి : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివాదాలెన్నో!)
ఆయన ఆది నుంచి పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై అక్కసు వెల్లగక్కుతున్నారు. ‘ఇది మన దేశానికి ఎంతో ప్రమాదకరం’, ‘ఓ ప్రళయం’ అని ఆయన అవకాశం దొరకినప్పుడల్లా పోస్టల్ బ్యాలెట్లపై విరుచుకు పడుతున్నారు. ‘2020 ఎన్నికలు చరిత్రలోనే గొప్ప రిగ్గింగ్‌గా నిలిచిపోతాయి’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
నవంబర్ ఒకటవ తేదీ నాటికి అమెరికాలో 24 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. వారిలో ఇప్పటికే 9.30 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 60 శాతం మంది డెమోక్రాట్ల మద్దతుదారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఇప్పటికే పలు సర్వేలు తెలియజేశాయి. అందుకే బ్యాలెట్ పత్రాలపై ట్రంప్ మండిపడుతున్నట్లున్నారు. ప్రతి పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు అధికారంలో ఉన్న ట్రంప్ తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. వాటిలో ఎక్కువ బ్యాలెట్ పత్రాలను ట్రంప్ సవాల్ చేసే అవకాశం ఉంది. వివిధ సాంకేతిక కారణాల వలన 1.3 శాతం అంటే లక్షా పదివేల పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించే అవకాశం ఉంది. (చదవండి : అమెరికాలో మొదలైన ఎన్నికల పోలింగ్)
2000 సంవత్సరంలో జార్జిబుష్, అల్ గోరే మధ్య జరిగిన ఎన్నికల్లో ఫ్లోరిడాలో బుష్‌కు 537 ఓట్లు ఎక్కువ రావడంతో ఆ రాష్ట్రానికి చెందిన మొత్తం 25 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు బుష్ పక్షాన వెళ్లిన విషయం తెల్సిందే. పోస్టల్ బ్యాలెట్ పత్రాల లోపాలను పట్టుకునేందుకు ట్రంప్ న్యాయవాదులు అప్పుడే రంగంలోకి దిగారు. బ్యాలెట్ ఓటు వేసే నాటికి అందులో పేర్కొన్న చిరునామాకు, ఉంటున్న చిరునామాకు ఏ మాత్రం తేడాలు ఉన్నా, జోసఫ్ బదులు జో అని, రిచర్డ్ బదులు రికీ అనే షార్ట్ నామధేయాలున్నా, సంతకాల్లో ఏ మాత్రం తేడాలున్నా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను సవాల్ చేసే అవకాశం ఉంటుంది.
అమెరికా ఎలక్టోరల్ కాలేజీకి డిసెంబర్ 8వ తేదీ నాటికి ఇంకా 538 మంది ఓటర్లను ఎన్నుకోవాల్సి ఉంది. వారంతా దేశాధ్యక్షుడిని ఎన్నుకునేందుకు డిసెంబర్ 8వ తేదీన సమావేశం కానున్నారు. సాధారణంగా అమెరికా ప్రజలతోపాటు ప్రపంచ ప్రజలు కూడా అమెరికా అధ్యక్షుడిని పాపులర్ ఓటు ద్వారా ఎన్నిక కావాలని కోరుకుంటారు. అయితే అలా జరుగుతుందనే గ్యారంటీ లేదు. దీనికి సంబంధించి అమెరికా రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ టూ, సెక్షన్ వన్‌లో స్పష్టత లేదు.
ఈ సారి ఎన్నికలపై వివాదం తలెత్తితే అమెరికా అధ్యక్షుడు సంప్రదాయబద్దంగా వచ్చే జనవరి 20వ తేదీన అమెరికా వాషింఘ్టన్ డీసీలోని కాపిటల్ భవన్‌లో పదవీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ లోపల సుప్రీం కోర్టు తన తీర్పును వెలువరించే అవకాశం లేదు.
Comments
Please login to add a commentAdd a comment