ప్రతీకాత్మక చిత్రం
లాస్ ఏంజలస్: గర్భంతో ఉన్న తల్లికి కోవిడ్ సోకితే నెలలు పుట్టకముందే శిశువు జన్మించే అవకాశాలు ఎక్కువవుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నిపుణులు నిర్వహించిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. వీటిని లాన్సెట్ ఆరోగ్య విభాగంలో ప్రచురించారు. నెలలు నిండక ముందే జన్మించడం అరుదేమీ కాదని, అయితే ఆ సాధారణ పరిస్థితులు ఉన్న వారిలో పోలిస్తే కరోనా సోకిన వారిలో 60శాతం ఎక్కువ ముందస్తు ప్రసవాలు జరుగుతున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని పరిశోధనలో పాల్గొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ దెబోరా కరాసెక్ తెలిపారు.
కరోనా సోకిన గర్భవతుల్లో ముందస్తు ప్రసవాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అన్వేషిస్తూ తమ పరిశోధన సాగిందని వెల్లడించారు. 2020 జూలై నుంచి 2021 జనవరి వరకూ ఈ అధ్యయనం జరిగిందన్నారు. మొత్తం 2,40,157 ప్రసవాల్లో.. ముందస్తు ప్రసవాలు 9000 ఉన్నాయన్నారు. అందులో 3.7శాతం మంది కోవిడ్ సోకిన వారు ఉన్నారని తెలిపారు. కోవిడ్ సోకని వారికి 8.7శాతం ముందస్తు ప్రసవాలు జరగ్గా, కోవిడ్ సోకిన వారిలో 11.8 శాతం ముందస్తు ప్రసవాలు జరిగినట్లు గుర్తించామన్నారు.
కోవిడ్ సోకి, ముందుస్తు ప్రసవం జరిగిన వారిలో ప్రభుత్వ బీమా ఉన్న వారు 40 శాతం మంది ఉన్నారన్నారు. హైపర్‌టెన్షన్, డయాబెటిస్, ఒబెసిటీ ఉన్నవారు 15.9 శాతం మంది ఉన్నట్లు తెలిపారు. అందులోనూ కోవిడ్ సోకి డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఉన్నవారిలో ఏకంగా 160 శాతం ముందస్తు ప్రసవ ముప్పు గుర్తించినట్లు వెల్లడించారు. అయితే ఈ అధ్యయనంలో కోవిడ్ సోకిన కాలం, దాని తీవ్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment