
కైరో: ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే సముద్ర వాణిజ్య మార్గాలలో సూయజ్ కాలువ ఒకటి. ఎర్ర సముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలుపుతూ ఈజిప్ట్ భూ భాగంలో సుయాజ్ కాలువను నిర్మించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం కొద్దిరోజులపాటు ఈ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోనున్నాయి. దీనికి కారణం, మంగళవారం కాలువలో ఒక భారీ షిప్ చిక్కుకుంది. 400 మీటర్ల పొడవు.. 59 మీటర్ల వెడల్పు ఉన్న ఎవర్ గ్రీన్ కంపెనీ కంటైనర్ షిప్ కాలువకు అడ్డుగా నిలిచింది. ఈ షిప్ ఇసుకలో కూరుకపోయి ఉండవచ్చునని నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం గుండా వెళ్లే సుమారు 100 షిప్‌ల రవాణాకు ఆటంకం ఏర్పడనుంది.
కాగా 193 కిలోమీటర్ల పొడవైన సూయజ్ కాలువ ద్వారా, మధ్య ప్రాచ్యం నుంచి యూరప్, ఉత్తర అమెరికాకు ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు సాగుతాయి. ఇక ప్రపంచ వాణిజ్యంలో ప్రతి ఏటా సుమారు 12 శాతం ఈ కాలువ ద్వారానే వ్యాపారం జరుగుతుంది. అంతేకాకుండా 8 శాతం సహజవాయువు ఈ కాలువ ద్వారా వివిధ దేశాలకు రవాణా జరగుతోంది. ప్రతిరోజూ పది లక్షల బ్యారెల్స్ ఆయిల్ సరఫరా అవుతోంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం షిప్ కారణంగా ఈ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోవడంతో, ఆయా దేశాల్లో ఇంధన ధరలు పెరగవచ్చని వాణిజ్య నిపుణులు భావిస్తోన్నారు. ఈ షిప్‌ను మళ్లీ సరైన మార్గంలోకి తెచ్చేందుకు ప్రత్యేకమైన పడవలను ఏర్పాటు చేశారు. ఇక్కడ పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేందుకు కొన్ని రోజులు పట్టవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో ఆసియా-యూరప్‌ల మధ్య వాణిజ్యంపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది.
చదవండి: గాల్లో తేలుతున్న భారీ నౌకలు
Comments
Please login to add a commentAdd a comment