Afghan Women: చదువుల్లేక.. ఉద్యోగాల్లేక.. ఉరికొయ్యలే దిక్కై! | Taliban intensify repression of Afghan womens and girls | Sakshi
Sakshi News home page

Afghan Women: చదువుల్లేక.. ఉద్యోగాల్లేక.. ఉరికొయ్యలే దిక్కై!

Published Tue, Jun 6 2023 5:35 AM | Last Updated on Tue, Jun 6 2023 8:38 AM

Taliban intensify repression of Afghan womens and girls - Sakshi

‘‘నాకు జీవితంపై ఇక ఎలాంటి ఆశలు లేవు. మమ్మల్ని చదువుకోనివ్వడం లేదు. స్వేచ్ఛగా బతికే అవకాశం లేదు. కుంగుబాటు, ఆందోళన నన్ను వేధిస్తున్నాయి. ఈ జీవితాన్ని ముగించాలన్న ఆలోచనలు తరచుగా వస్తున్నాయి. ఈ బాధలు భరించలేను. నా ఆవేదన ఎవరైనా వింటే బాగుండు. ఇది కేవలం నా ఒక్కరి దుస్థితి కాదు. నాతోపాటు యూనివర్సిటీలో చదువుకున్న యువతులంతా ఇలాగే మదన పడుతున్నారు. ఆత్మహత్య ఆలోచనలతో నిత్యం సతమతం అవుతున్నారు. బతకలేక చావలేక కుమిలిపోతున్నారు’’
– అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లకుపైగా వయసున్న ఓ యువతి కన్నీటి గాథ ఇది.  

రాక్షస పాలనలో నిత్య నరకం  
అఫ్గానిస్తాన్‌లో 2021 ఆగస్టు నుంచి తాలిబన్ల పరిపాలన మళ్లీ మొదలైంది. అమెరికా సేనలు వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్‌ ముష్కరులు అధికారంలోకి వచ్చారు. తాము పూర్తిగా మారిపోయామని, ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడుకుంటామని తొలుత ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆచరణలో మాత్రం రాక్షస పాలనకు తెరతీశారు. మహిళలపై కఠినమైన ఆంక్షలు విధించారు. వారిపై దారుణమైన వివక్ష కొనసాగుతోంది. చదువులు లేవు, ఉద్యోగాలు లేవు. ఆర్థిక స్వేచ్ఛ అసలే లేదు. అఫ్గాన్‌ బాలికలకు కొన్నిచోట్ల ప్రాథమిక విద్య మాత్రమే అందుబాటులో ఉంది. అంటే ఆరో తరగతి వరకూ పాఠశాలలకు వెళ్లి చదువుకోవచ్చు.

ఆ తర్వాత ఇంటికి పరిమితం కావాల్సిందే. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు నిరాకరిస్తున్నారు. కాలేజీ, యూనివర్సిటీ చదువులు యువకులకు మాత్రమే అన్నట్లుగా అనధికార శాసనం అమల్లోకి వచ్చింది. ఈ పరిణామాలన్నీ యువతుల్లో మానసిక సమస్యలను, అనారోగ్యాలను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది అర్ధంతరంగా జీవితాలను చాలించినట్లు తెలుస్తోంది. సైకాలజిస్టులను సంప్రదించే బాధితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని సంగ్‌చారక్‌ జిల్లాలో రెండు పాఠశాలల్లో ఇటీవలే దాదాపు 80 మంది విద్యార్థినులపై విష ప్రయోగం జరిగింది. స్కూళ్లకు రాకుండా బాలికలను భయపెట్టడానికే విద్రోహులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.  

శరీరంలోకి విషం ఎక్కించినట్లుగా..
అఫ్గాన్‌ యువతుల్లో ఆత్మహత్య ఆలోచనలు ఒక మహమ్మారిలా వ్యాప్తి చెందుతున్నాయని సైకాలజిస్టు డాక్టర్‌ అమల్‌ చెప్పారు. పరిస్థితి దిగజారుతోందని, ఇక్కడి వాస్తవాలు ప్రపంచానికి తెలియడం లేదని అన్నారు. ఆకలి చావులు, ఆహార సంక్షోభం గురించి మాత్రమే వార్తా పత్రికల్లో రాస్తున్నారని, మానసిక అనారోగ్య సమస్యల గురించి ఎవరూ రాయడం లేదని, మాట్లాడడం లేదని వెల్లడించారు. శరీరంలోకి నెమ్మదిగా విషం ఎక్కించినట్లుగా యువత ప్రవర్తిస్తున్నారని, జీవితంపై ఆశలు కోల్పోతున్నారని డాక్టర్‌ అమల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీల్లో యువతులకు ప్రవేశం లేదంటూ తాలిబన్లు ప్రకటించినప్పుడు మొదటి రెండు రోజుల్లో తనకు 170 ఫోన్‌కాల్స్‌ వచ్చాయన్నారు. ఇప్పుడు నిత్యం దాదాపు 10 కాల్స్‌ వస్తున్నాయని తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది బాలికలు, యువతులే ఉంటున్నారని వివరించారు. వారిలో ఆత్మహత్య ఆలోచనలు పోగొట్టి, స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు.  

తాలిబన్‌ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించాలి  
అఫ్గానిస్తాన్‌లో పితృస్వామ్య వ్యవస్థ బలంగా పాతుకుపోయింది. మహిళలపై ఆంక్షలు, వివక్ష, వేధింపులు అనేవి సహజంగా మారిపోయాయి. దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరు మానసికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. బాధితుల్లో మహిళలే గణనీయంగా ఉంటారని తెలియజేసింది. తాలిబన్ల పెత్తనం మొదలయ్యాక పరిస్థితి మరింత దిగజారిందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఆంక్షలు, వివక్షకు ఆర్థిక సంక్షోభం కూడా తోడయ్యిందని, ఇవన్నీ మహిళలను ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తున్నాయని అంటున్నారు.

హెరాత్‌ ప్రావిన్స్‌లో ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో.. కౌమార వయసులో ఉన్నవారిలో మూడింట రెండొంతుల మందిలో ఆందోళన, కుంగుబాటు లక్షణా­లు ఉన్నట్లు వెల్లడయ్యింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సకాలంలో చికిత్స అందించకపోతే వారు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. దేశంలో ఆత్మహత్యల సంఖ్యను తాము రికార్డు చేయ­డం లేదని తాలిబన్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, తాలిబన్‌ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశా­లు అధికారికంగా గుర్తించాలని అఫ్గాన్‌ ప్రజలు కోరుతున్నారు. అలాగైతే తాలిబన్ల వైఖరిలో మార్పు వచ్చే అవకాశం ఉందని, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దేశం అభివృద్ధి చెందుతుందని, మహిళలపై ఆంక్షలు రద్దవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

మహిళా కళాశాలలను తాలిబన్లు మూసేశారు. దాంతో నా ఉద్యోగం పోయింది. ఎక్కడా ఉపాధి దొరకలేదు. ఇంట్లో అందరినీ పోషించాల్సింది నేనే. పని దొరక్క చేతిలో చిల్లిగవ్వ లేకుండాపోయింది. నిర్భయంగా బయట తిరగలేం. ఇంట్లోనే ఉండిపోవాలి. ఎలా బతకాలో తెలియడం లేదు. అందుకే మరోదారి లేక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశా.
–మెహర్‌ అనే అధ్యాపకురాలి ఆవేదన ఇది

ఈ ఏడాది మార్చి నెలలో స్కూల్‌ పునఃప్రారంభం కాగా, తరగతులకు హాజరయ్యేందుకు తన కుమార్తె ఉత్సాహంగా సిద్ధమైందని, తీరా అక్కడికి వెళ్లాక రావొద్దని చెప్పడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని నాదిర్‌ అనే వ్యక్తి చెప్పాడు. పెద్ద చదువులు చదువుకొని, దేశానికి సేవ చేయాలని తన బిడ్డ కలలు కనేదని తెలిపాడు. తాలిబన్‌ పాలకులు బాలికల పాఠశాలలను మూసివేశారని వెల్లడించాడు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement