అతనొక గొప్ప మేధావి. హార్వర్డ్ విశ్వవిద్యాలయం జీనియస్. మిచిగాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ డిగ్రీని పొందిన వ్యక్తి. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం మ్యాథమెటిక్స్ ప్రోఫెసర్. చిన్నతనంలో పేలుళ్లకు సంబంధించిన అనేక ప్రయోగాలు చేశాడు. ఎన్నో బాంబులను తయారు చేయగల మేధస్సు అతని సొంతం. అలాంటి విజ్ఞాన వేత్త పారిశ్రామీకరణ, అభివృద్ధి పేర్లతో ప్రకృతిని నాశనం చేయడాన్ని సహించలేకపోయాడు. అందుకోసం ఎంచుకున్న మార్గం తప్పుకావచ్చునేమో గానీ అతను ఆలోచన విధానం మంచిదే. ప్రజలకు ప్రకృతిపట్ల అవగాన కలిగేలా చైతన్య పరచాలనుకునే క్రమంలో దారుణాలకు ఒడిగట్టి ఉగ్రవాదిగా ముద్రవేయించుకున్నాడు. ఆ క్రమంలో పోలీసులకు చిక్కి జైల్లోనే మగ్గి.. చివరికి అక్కడే కన్నుమూశాడు టెడ్ జాన్ కాజిన్‌స్కీ . అతనెవరూ ఏమిటా గాథ!
అసలేం జరిగిందంటే..టెడ్ జాన్ కాజిన్‌స్కీ మాజీ గణితశాస్త్ర ప్రోఫెసర్, వక్రీకృత మేధావి. అతను 17 ఏళ్ల పాటు అమెరికాకు కునుకులేకుండా చేసి గడగడలాడించిన అమెరికన్ దేశీయ ఉగ్రవాది. కాజిన్‌స్కీ మే 22, 1942న చికాగోలో శ్రామిక రంగానికి చెందిన పోలిష్-అమెరికన్ తల్లిదండ్రులకు జన్మించాడు. అతను గణితాన్ని అభ్యసించి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో స్కాలర్‌షిప్‌ను గెలుచుకున్న గొప్ప జీనియస్. అంతేగాదు 1967లో మిచిగాన్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రంలో డాక్టరల్ డిగ్రీని పొందాడు. ఆ తర్వాత బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మ్యాథమెటిక్స్ ప్రోఫెసర్‌గా ఉద్యోగం సంపాదించాడు. అక్కడే ప్రోఫెసర్‌గా కొన్నేళ్లు పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత 1971లో మోంటానాకు వెళ్లాడు.
ఆ క్షణం నుంచే కాజిన్‌స్కీ జీవితంలో కీలక పరిణామాలు చోటుచేసుకోవడమే గాక పతనం వైపుకి అడుగులు వేశాడు. మోంటానాలో సుమారు వెయ్యి మందికి మించి జనాభా ఉండరు. ఐతే కాజిన్‌స్కీ ఆ మోంటానాలోనే కరెంట్, నీరు సదుపాయం లేని ఓ రిమోట్ ఏరియాలో భూమిని కొనుగోలు చూసి ఓ చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని ఉండటం ప్రారంభించాడు. అక్కడ తనలో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి మరింతగా అభివృద్ధి పరుచుకునేందుకు ఏకాంతంగా గడపాలని నిశ్చయించుకున్నాడు. కానీ అందుకు విరుద్ధంగా అతని ఆలోచన తీరు మారిపోయింది.
ఆ చుట్టుపక్కల ఉన్న అడువులను పారిశ్రామీకరణ, అభివృద్ధి పేరుతో నాశనం చేయడం చూసి తీవ్రంగా కలత చెందాడు కాజిన్‌స్కీ. దీనికి ఎలాగైన ఫుల్‌స్టాప్ పెట్టించాలనుకున్నాడు. అందులో భాగంగా పర్యావరణ విధ్వంసానికి కారణమైన వ్యక్తులపై మెయిల్ బాంబు దాడులకు పాల్పడ్డాడు. ఎన్నో బాంబులు తయారు చేసి విధ్యంసం సృష్టించాడు. అలా కాజిన్‌స్కీ దాడిలో ముగ్గురు చనిపోగా, 23 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఓ వాణిజ్య విమానాన్ని పేల్చేందుకు కూడా యత్నించాడు. అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టేషన్(ఎఫ్‌బీఐ)కి ఓ తలనొప్పిగా మారాడు.
చిన్న క్లూ కూడా దొరక్కుండా దాడులకు యత్నించాడు. అతడిని పట్టుకోవడం అత్యంత ఖరీదైన వ్యవహారంగా ఉండేది. ఈ బాంబు దాడులకు పాల్పడుతున్న కిల్లర్‌ని గుర్తించలేకపోవడంతో వారు ఆగంతుకుడికి అనాబాంబర్(యూనివర్సిటీ అండ్ ఎయిర్‌లైన్ బాంబర్) అని నామకరణం చేశారు. ఆఖరికి మీడియా సైతం ఆ పేరుతోనే వ్యవహరించడంతో కాజిన్‌స్కీకి ఆ పేరు స్థిరపడిపోయింది. ఆ అనాబాంబర్ కోసం ఎఫ్‌బీఐ పడ్డ పాట్లు అంత ఇంత గాదు. ఐతే కాజిన్‌స్కీ అరెస్టు అవ్వడానికి ముందు సరిగ్గా 1995లో ది న్యూయార్క్ టైమ్స్‌కు ఒక లేఖ పంపాడు. దాదాపు 35 వేల పదాలతో కూడిన తన మ్యానిఫెస్టో(వ్యాసం) ప్రచురించినట్లయితే తాను ఉగ్రవాదాన్ని వదిలేస్తానని ప్రకటించాడు. దీంతో ఎఫ్‌బీఐ ఆ అగంతకుడు మ్యానిఫెస్టో(వ్యాసం)ని ప్రచురిస్తే.. అతడెవరనేది తెలిసే అవకాశం ఉంటుంది. అతను రాసే శైలిని ఎవరైన గుర్తిస్తే నిందితుడిని పట్టుకోవచ్చు అన్న ఆశతో ఎఫ్‌బీఐ ప్రచురించేందుకు సదరు పత్రికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆ వ్యాసంలో.. పారిశ్రామిక విప్లవం దాని పరిణామాలు మానవ జాతికి ఎలా ముప్పుగా మారాయి అనే అంశంతో ప్రారంభమైంది. అలాగే తాను తయారు చేసిన బాంబు దాడులు ఎంతలా విధ్వంసం సృష్టించగలవో కూడా వివరించాడు. అలాగే మానవుల ప్రకృతిని నాశనం చేసిన తనను తాను కోల్పోతున్నాడని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. అందువల్ల దీనిపై దృష్టిపై సారించడం అత్యంత కీలకమని ఆ వ్యాసంలో వివరించాడు. ఎఫ్‌బీఐ భావించినట్లుగానే ఆ వ్యాసం రాసిన శైలి ఆధారంగా ఆగంతకుడు ఎవరనేది కనుక్కోగలిగారు. కజిన్‌స్కీ సోదరుడు డేవిడ్ ఈ వ్యాసం శైలీ తీరును గుర్తించి ఎఫ్‌బీఐకి తెలిపాడు. అంతేగాదు కాజిన్‌స్కీకి 12 ఏళ్ల వయస్సులో పేలుళ్లను సృష్టించే పరిజ్ఞానం ఉందని చెప్పాడు. దీంతో ఎఫ్‌బీఐ 1996లో కాజిన్‌స్కీ అరెస్టు చేసింది.
నేరం నుంచి తప్పించుకోవడానికి కాజిన్‌స్కీ తరుఫు న్యాయవాదులు పిచ్చివాడిగా నటించమన్నారు. అందుకు తిరస్కరించి..తాను చేసిన బాంబు దాడులకు సంబంధించిన అన్ని నేరాలను కోర్టు ఎదుట అంగీకరించాడు. దీంతో కాలిఫోర్నియా కోర్టు అతనికి నాలుగు జీవిత ఖైదుల తోపాటు 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత కాజిన్‌స్కీని కొలరాడోలోని ఫ్లోరెన్స్‌లో సూపర్‌మాక్స్ జైలుకి తరలించారు అధికారులు. అక్కడే జైలు శిక్షను అనుభవిస్తూ 81 ఏళ్ల వయసులో మరణించాడు. ఈ మేరకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ ప్రతినిధి క్రిస్టీ బ్రెషెర్స్ శనివారమే కాజిన్‌స్కీ చనిపోయినట్లు ప్రకటించింది. కాజిన్‌స్కీ చెడు మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నాడనేందుకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. ఒక సదుద్దేశం అతన్ని విధ్యసం వైపుకి అడుగులు వేసేలా చేయడం బాధకరం.
--ఆర్ లక్ష్మీ లావణ్య , వెబ్ డెస్క్
(చదవండి: పరేడ్‌లో కుప్పకూలిన బ్రిటిష్ సైనికులు..వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment