TikTok Ban: Why Are More And More Countries Banning The Chinese App - Sakshi
Sakshi News home page

టిక్‌.. టిక్‌.. టిక్‌.. షేరింగ్‌కు సమయం లేదు మిత్రమా!

Published Thu, Mar 2 2023 5:08 AM | Last Updated on Thu, Mar 2 2023 9:22 AM

TikTok: More countries banning the Chinese app..Sakshi Special

మన దేశంలో  చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ అలరించిన మొబైల్‌ ఫోన్‌ అప్లికేషన్‌(యాప్‌) టిక్‌టాక్‌. యాప్‌లో స్వయంగా వీడియోలు రూపొందించి, సోషల్‌ మీడియాలో పోస్టుచేసి, లైక్‌లు కొట్టేయడం, కామెంట్లు చూసుకొని మురిసిపోవడం ఒక మధురానుభూతి, ఒక జ్ఞాపకం. చైనాకు చెందిన ఈ యాప్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించడంతో ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేకుండాపోయింది.

ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్‌ను నిషేధిస్తున్న దేశాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అమెరికాలో సగానికిపైగా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో యాప్‌ వాడకాన్ని నిషేధించారు. అమెరికా సైనిక దళాల్లో యాప్‌పై నిషేధం అమలవుతోంది. తాజాగా ఈ జాబితాలో కెనడా చేరింది. జనానికి నచ్చిన టిక్‌టాక్‌ను ప్రభుత్వాలే వారి నుంచి దూరం చేస్తుండడానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం..   

ఎందుకీ నిషేధం?  
► టిక్‌టాక్‌ను నిషేధించడానికి ప్రభుత్వాలు చెబుతున్న ప్రధాన కారణం దేశ భద్రత.  
► యూజర్ల డేటాతో పాటు బ్రౌజింగ్‌ హిస్టరీ, లొకేషన్‌ వంటి వివరాలు నేరుగా చైనా ప్రభుత్వానికి చేరే ప్రమాదం ఉందని వివిధ దేశాలు అనుమానిస్తున్నాయి.  
► ఇతర దేశాలపై, అక్కడి ప్రభుత్వాలపై దుష్ప్రచారం చేయడానికి టిక్‌టాక్‌ యాప్‌ చైనా చేతిలో ఒక ఆయుధంగా మారు తుందని భావిస్తున్నాయి.
► తప్పుడు ప్రచారం సాగించి, ఎన్నికల ఫలితాలను సైతం ప్రభావితం చేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.  
► టిక్‌టాక్‌ వల్ల యూజర్ల డేటాకు భద్రత లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వాలు ఇచ్చే ఫోన్లలోనూ టిక్‌టాక్‌ వాడుతున్నారని, దానివల్ల జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని అంటున్నారు.  
► విదేశాల సమాచారం చైనా చేతుల్లోకి వెళ్తే అక్కడి కంపెనీలు దాన్ని ఒక అవకాశంగా వాడుకొని లబ్ధి పొందుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.


ఏయే దేశాలు నిషేధించాయి?  
► 2021 జనవరిలో భారత్‌ టిక్‌టాక్‌ను పూర్తిస్థాయిలో నిషేధించింది. డేటా ప్రైవసీ, జాతీయ భద్రత కోసమంటూ చైనాకు చెందిన ఇతర యాప్‌లపైనా నిషేధం విధించింది.  
► ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లో తాత్కాలిక నిషేధం విధించారు. నిర్ధారణ కాని, అనైతిక సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకే ఈ చర్య తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వాలు వెల్లడించాయి.  ► అమెరికా, కెనడా, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)లో ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఫోన్ల నుంచి టిక్‌టాక్‌ను తొలగించాలంటూ ఉద్యోగులకు ఇటీవలే ఆదేశాలు అందాయి.  
► అమెరికాలో 50కిపైగా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేశారు. కేవలం ప్రభుత్వ ఫోన్లలోనే కాదు, సాధారణ ప్రజలు సైతం టిక్‌టాక్‌ వాడకుండా పూర్తిగా నిషేధించాలని అమెరికాలో కొందరు పార్లమెంట్‌ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.  
► అమెరికా సైనిక దళాల్లో టిక్‌టాక్‌ వాడకాన్ని ఇప్పటికే నిషేధించారు.  

► తైవాన్‌లో ప్రభుత్వ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ కంప్యూటర్లలో టిక్‌టాక్‌ యాప్‌ ఉపయోగించడాన్ని 2022 డిసెంబర్‌లో నిషేధించారు. 

టిక్‌టాక్‌ వాదనేంటి?  
► తమ యాప్‌ వల్ల డేటా భద్రత ఉండదన్న వాదనను టిక్‌టాక్‌ యాజమాన్యం ఖండించింది.  
► యాప్‌ కారణంగా డేటా చౌర్యం జరుగుతోందని తేల్చడానికి ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేసింది.  
► యూజర్ల వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే అవకాశమే లేదని, యాప్‌ను నిశ్చింతగా వాడుకోవచ్చని భరోసా ఇచ్చింది.  
► కొన్ని దేశాలు టిక్‌టాక్‌ను నిషేధించడం విచారకరమని పేర్కొంది. డేటా ప్రైవసీకి తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించింది.  
► యాప్‌ను నిషేధించడం యాజర్లను తప్పుదోవ పట్టించడమే అవుతుందని యాజమాన్యం ఆక్షేపించింది.  
► నిషేధం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించింది.  
► కొన్ని పాశ్చాత్య దేశాలు అభద్రతాభావంతో టిక్‌టాక్‌ను తొలగిస్తున్నాయని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని చైనా ప్రభుత్వం విమర్శిస్తోంది. యాప్‌పై నిషేధం విధించడం ఆయా దేశాల్లో వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీయడం ఖాయమని తేల్చిచెప్పింది.  


అసలు ఏమిటీ యాప్‌?
 చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్‌ అనే కంపెనీ ‘డౌయిన్‌’ పేరిట 2016 సెప్టెంబర్‌లో యాప్‌ను ప్రారంభించింది. తొలుత చైనాలోనే అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంది. రికార్డుస్థాయిలో డౌన్‌లోడ్లు జరిగాయి. దాంతో బైట్‌డ్యాన్స్‌ కంపెనీ 2017లో అంతర్జాతీయ వెర్షన్‌ను ప్రారంభించింది. దీనికి టిక్‌టాక్‌ అనే పేరుపెట్టింది. 2018 ఆగస్టు నుంచి యాప్‌ ప్రపంచమంతటా బాగా వ్యాప్తిలోకి వచ్చింది. చైనాలో ఇది డౌయిన్‌ పేరిటే కొనసాగుతోంది. తక్కువ నిడివితో కూడిన వీడియోల షేరింగ్‌ కోసం టిక్‌టాక్‌ యాప్‌ను రూపొందించారు. ప్రాథమికంగా లిప్‌ సింకింగ్, డ్యాన్సింగ్‌ వీడియోలను ఇతరులతో పంచుకొనే వీలుంది. 3 సెకండ్ల నుంచి 10 నిమిషాల నిడివిల వీడియోలు ఉంటాయి. యూజర్ల అభిరుచులు, ఆసక్తిని బట్టి వీడియోలు ప్రత్యక్షం కావడం ఇందులోని మరో ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా భాషల్లో టిక్‌టాక్‌ యాప్‌ అందుబాటులో ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement