యాసిడ్‌ పోసినా ప్రేమిస్తూనే ఉంటా!.. ‘తప్పుచేశావమ్మా’ | Turkey Acid Victim Marries Thug Boyfriend Who Attacked Her | Sakshi
Sakshi News home page

ఈ ప్రేమలో నిజంగానే నిజాయితీ ఉందా?

Published Sat, Dec 25 2021 9:09 PM | Last Updated on Sat, Dec 25 2021 9:09 PM

Turkey Acid Victim Marries Thug Boyfriend Who Attacked Her - Sakshi

Turkey Acid Victim Marriage ex despite acid attack:  లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌.. యస్‌, ఎలాంటోళ్లనైనా తన మాయలో ముంచెత్తుతుంది ప్రేమ. ఆ మత్తులో మునిగితే మంచే కాదు.. ఒక్కోసారి చెడు కూడా జరుగుతుంటుంది. అయితే ఆ యువతి జీవితంలో మాత్రం ‘ప్రేమ’ ఘోరమైన తప్పటడుగు వేసింది. మాజీ ప్రియుడన్న ట్యాగ్‌ను తట్టుకోలేక ఉన్మాద చర్యకు పాల్పడ్డాడు. వికారంగానేకాదు.. అంధురాలిగా కూడా మార్చేశాడు.  అయితేనేం మాయని గాయం చేసిన వాడినే మనువాడి.. ఆసక్తికర చర్చకు తెర తీసింది ఆ యువతి. 


బెర్ఫిన్‌ ఒజెక్‌(20).. టర్కీ యువతి. 2019లో యాసిడ్‌ దాడికి గురైంది. 70 శాతం చూపు పొగొట్టుకుని.. ముఖం అందవికారంగా మారిపోయింది. ఆ దాడి చేసింది ఎవరో కాదు.. ఆమె మాజీ ప్రియుడు ఒజన్‌ సెల్‌టిక్‌. బ్రేకప్‌ తర్వాత ఓరోజు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. క్షమించమని, తిరిగి ప్రేమించాలన్నా అతని కోరికను ఆమె అంగీకరించలేదు. తనకు దక్కకుంటే ఎవరికీ దక్కకూడదనే నిర్ణయానికి వచ్చాడు. ఆ కోపంలో ఆమెపై యాసిడ్‌ గుమ్మరించాడు.    


పోరాటం.. 
బెర్ఫిన్‌పై జరిగిన దాడికి టర్కీ మొత్తం కదిలింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు కోర్టుకు ఎక్కాయి. దీంతో పరారీలో ఉన్న ఒజన్‌ను ఎట్టకేలకు పోలీసులు కనిపెట్టి.. అరెస్ట్‌ చేశారు. అయినా న్యాయపోరాటం ఆగలేదు. జనాగ్రహానికి కదిలిన ఇస్కెండెరన్‌ కోర్టు (హతాయ్‌ ప్రావిన్స్‌) 13 ఏళ్ల ఆరు నెలల శిక్ష విధించింది. యాసిడ్‌ బాధిత కేసుల్లో బెర్ఫిన్‌ కేసు పోరాటం ద్వారా ఒక స్ఫూర్తిగా నిలిచింది. 


పూలు.. ప్రేమ లేఖలు.. క్షమాపణలు

ఒజన్‌ జైలుకి వెళ్లినా.. బెర్ఫిన్‌కు ప్రేమ సందేశాలు పంపడం ఆపలేదు. పైగా జరిగిన ఘటనకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ లేఖలు, పూలు పంపసాగాడు. దీంతో కరిగిపోయిన ఆ యువతి తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. దీంతో అతని శిక్షా కాలం తగ్గిపోయింది. మరోవైపు కరోనా కారణంగా మే 2022లో రిలీజ్‌ కావాల్సిన ఒజన్‌.. ఈమధ్యే  బయటకు వచ్చాడు ఒజన్‌. వచ్చిరాగానే  వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆమె సంతోషంగా ఒప్పుకుంది.  ఇద్దరూ సంతకాలతో ఒక్కటయ్యారు. 


కన్నవాళ్ల కోపం.. ఇంటర్నెట్‌లో మంట

బెర్ఫిన్‌ నిర్ణయం సోషల్‌ మీడియాలో నెటిజన్లకు మంట తెప్పించింది. ఒక బాధితురాలిగా ఆమెకు మద్దతు తెలిపిన వాళ్లంతా.. ఇప్పుడు తిరగబడ్డారు. ముఖాన్ని వికారంగా మార్చేసి.. కంటిచూపు పోయేలా చేసిన మృగాన్ని ఎలా క్షమిస్తావని? పైగా పెళ్లి చేసుకుంటావా? అని తిట్టిపోస్తున్నారు. తప్పు చేశావమ్మా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రేమ ఎక్కువ రోజులు నిలవదని శాపనార్థాలు పెడుతున్నారు. మరోవైపు బెర్ఫిన్‌ తండ్రి ఈ వ్యవహారంపై స్పందించేందుకు ఇష్టపడడం లేదు. తమకు తెలియకుండానే కూతురు వివాహం చేసుకుందని, ఆమె కోసం చేసిన పోరాటం అంతా వృథా అయ్యిందని ఆయన బాధపడుతున్నాడు. వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలపై ఈ కొత్త జంట స్పందించాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement