Twitter Ceo Donates Money: Twitter Founder Donates 110 cr To India Covid Relief Fund - Sakshi
Sakshi News home page

కోవిడ్‌ సంక్షోభం: భారత్‌కు మద్దతుగా ట్విటర్‌ భారీ విరాళం

May 11 2021 8:51 AM | Updated on May 11 2021 2:24 PM

Twitter Donates Huge Amount For COVID-19 Relief In India - Sakshi

వాషింగ్టన్‌: భారత్‌లో ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు నాలుగు లక్షలకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. ఆక్సిజన్‌ కొరతతో రోజు వందల మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖులు, నటీనటులు, మల్టీనేషనల్‌ కంపెనీలు భారత్‌కు అండగా నిలుస్తున్నారు. కరోనాపై భారత్‌ చేస్తోన్న యుద్ధంలో  ప్రపంచంలోని ఇతర దేశాలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయి.అంతేకాకుండా ప్రపంచంలోని టెక్‌ దిగ్గజ కంపెనీలు గూగల్‌, మైక్రోసాఫ్ట్‌ భారీ మొత్తంలో భారత్‌కు విరాళాలను ఇచ్చాయి.

తాజాగా కరోనాపై భారత్‌ చేస్తోన్న పోరులో ట్విటర్‌ భారీ విరాళాన్ని కేటాయించింది. ట్విటర్‌ అధినేత జాక్ పాట్రిక్ డోర్సే సుమారు 15 మిలియన్ డాలర్లు (సుమారు రూ.110 కోట్ల) విరాళాన్ని భారత్‌కు అందిస్తున్నట్లు ట్విటర్‌లో తెలిపారు. భారత్‌లో కోవిడ్‌-19 ఎదుర్కొనేందుకుగాను పాటుపడుతున్న మూడు  ఎన్జీవో సంస్థలకు విరాళాన్ని అందించాడు. ఈ విరాళాన్ని  కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యుఎస్ఎ అనే మూడు ప్రభుత్వేతర సంస్థలకు విరాళంగా ఇచ్చినట్లు ట్విటర్ సీఈఓ జాక్ పాట్రిక్ డోర్సే సోమవారం ట్వీట్ చేశారు.

కేర్‌ స్వచ్చంద సంస్థకు 10 మిలియన్ డాలర్లు, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషన్‌ యూఎస్‌ఏలకు 2.5 మిలియన్ డాలర్ల చొప్పున విరాళాన్ని కేటాయించాడు. ఈ విరాళాలతో ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సన్‌ట్రెటర్‌లు, వెంటిలేటర్‌లు, ఇతర మెడికల్‌ సౌకర్యాలను భారత్‌కు అందించనున్నారు.కాగా గత 24 గంటల్లో దేశంలో రికార్డుస్థాయిలో 3.66 లక్షలకు పైగా కొత్త కోవిడ్-19 కేసులు, 3754 మరణాలు నమోదైనాయి.దేశంలో కరోనా పరిస్థితులు, ఆక్సిజన్‌, నిత్యావసర మందుల సరఫరా కొరత  నేపథ్యంలో బ్రిటన్‌, అమెరికా, సౌదీ అరేబియా, సింగపూర్‌ లాంటి దేశాలు ఇప్పటికే తమ సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 


చదవండి: కోవిడ్‌ సంక్షోభం: సుందర్‌ పిచాయ్‌, సత్య నాదెళ్ల సాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement