లండన్: బ్రిటన్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఒక భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. మొత్తం 50 జాతీయ ఆరోగ్య సేవా ఆస్పత్రుల్లో కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ఫైజర్ వ్యాక్సిన్‌ను ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్నట్టు బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మట్ హన్‌కాక్ చెప్పారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఇళ్లల్లోనే ఉండే వయో వృద్ధులకు, ముఖ్యంగా 80 ఏళ్ల వయసు పై బడిన వారికి, వారి సంరక్షకులకి మొట్ట మొదట వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టుగా మంత్రి తెలిపారు.
ప్రజలందరూ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సహకరించాలని, నిబంధనలన్నీ తప్పనిసరిగా పాటించాలని మంత్రి పిలుపునిచ్చారు. కరోనా సెకండ్ వేవ్‌తో అతలాకుతలం అవుతున్న యూకే గతవారంలోనే అమెరికాకి చెందిన ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతుల్ని మంజూరు చేసిన విషయం తెలిసిందే. 6.7కోట్ల జనాభా ఉన్న బ్రిటన్ తొలి విడతగా 2 కోట్ల మందికి టీకా డోసుల్ని ఇవ్వనుంది. ఇందు కోసం 4 కోట్ల టీకా డోసులకి ఆర్డర్ చేసింది. బెల్జియం నుంచి ఇప్పటికే 8 లక్షల డోసులు జాతీయ ఆరోగ్య కేంద్రాలకి చేరుకున్నాయి.
రాణి దంపతులకు వ్యాక్సినేషన్!
బ్రిటన్ రాణి ఎలిజెబెత్ (94), ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (99)లకు త్వరలో ఫైజర్ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. వయసుని దృష్టిలో ఉంచుకొని వారికి తొలి ప్రాధాన్యంగా టీకా ఇస్తారని ది మెయిల్ పత్రిక వెల్లడించింది. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని ప్రజల్లో నమ్మకం పెంచేందుకు రాణి దంపతులతో పాటు మరి కొందరు ప్రముఖులు కూడా టీకా తీసుకోనున్నారు. అయితే బకింగ్çహామ్ ప్యాలె స్ టీకా అంశంలో ఇంకా స్పందించాల్సి ఉంది.
చైనా సన్నాహాలు
చైనా కూడా దేశీయంగా అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌ను ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. 140 కోట్ల మంది జనాభాకి వ్యాక్సిన్ ఇవ్వడం సవాలేనని అధికారులు చెప్పారు. చైనాలో మొత్తం అయిదు వ్యాక్సిన్‌లు తుది దశ ప్రయోగాల్లో ఉన్నాయి. వీటిలో సినోఫార్మ్ కంపెనీ టీకా వినియోగం కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం ఏ వ్యాక్సిన్‌ను ఇస్తుందో అధికారికంగా వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment