వాషింగ్టన్: అటు ఏడాదిన్నర దాటినా ఆగని రష్యా–ఉక్రెయిన్ యుద్ధం. ఇటు తాజాగా పాలస్తీనా–హమాస్ పోరు. ఇంకోవైపు భయపెడుతున్న చైనా–తైవాన్ తదితర ఉద్రిక్తతలు. ఈ సమస్యలన్నీ చాలవన్నట్టు దేశాల మధ్య అణ్వాయుధ పోటీని మరింత పెంచే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. అత్యంత శక్తిమంతమైన సూపర్ అణు బాంబును తయారు చేయనున్నట్టు మంగళవారం ప్రకటించింది.
అది రెండో ప్రపంచ యుద్ధం చివర్లో జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు కంటే ఏకంగా 24 రెట్లు శక్తిమంతంగా ఉండనుందని వెల్లడించింది. 1945 ఆగస్టులో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా వేసిన అణుబాంబులు లెక్కలేనంత జన నష్టానికి దారితీయడం తెలిసిందే. ఆ విధ్వంసాన్ని తలచుకుని జపాన్ ఇప్పటికీ వణికిపోతుంటుంది.
హిరోషిమాపై వేసిన అణుబాంబు 15 కిలో టన్నుల శక్తిని, నాగసాకిపై పడ్డ బాంబు 23 కిలో టన్నుల శక్తిని విడుదల చేశాయి. ఇప్పుడు తయారు చేయనున్న అణుబాంబు ఏకంగా 360 కిలో టన్నుల శక్తిని వెలువరిస్తుందని చెబుతున్నారు. బి61 న్యూక్లియర్ గ్రావిటీ బాంబును ఆధునీకరించి రూపొందిస్తున్న ఈ బాంబును బి61–13గా పిలుస్తున్నారు. దీని తయారీకి అమెరికా కాంగ్రెస్ అనుమతి లభించాల్సి ఉంది. అంతేగాక తమ అమ్ములపొదిలో ఉన్న అణ్వాయుధాలను 2030 కల్లా 1,000కి పెంచనున్నట్టు కూడా అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది.
చదవండి: పాక్‌లో ఏం జరుగుతోంది? టెర్రరిస్టుల హత్యల్లో అంతుచిక్కని రహస్యం?
Comments
Please login to add a commentAdd a comment