బీజింగ్: చైనాలోని దక్షిణ గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న తైషాన్ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదకరమైన రేడియో యాక్టివ్ గ్యాస్ లీకవుతోందని, ఇదొక భారీ విపత్తుగా మారనుందని అమెరికా సీక్రెట్ ఇంటెలిజెన్స్ నివేదిక బహిర్గతం చేసింది. గత రెండు వారాల నుంచి గ్యాస్ లీకేజీ కొనసాగుతున్నట్లు తైషాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో భాగస్వామ్యం ఉన్న ఫ్రాన్స్ సంస్థ ఫ్రామటోమ్ తెలిపింది. ఫ్రామటోమ్ ఈ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. ఈ సమాచారాన్ని అమెరికాకు చేరవేసింది. దీంతో అమెరికన్ ఏజెంట్లు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు.
లీకేజీని ఆపకపోతే ఇది పెద్ద విపత్తుకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలను తైషాన్ ప్లాంట్ యజమాన్యం కొట్టిపారేస్తోంది. అంతా సాధారణంగానే ఉందని చెబుతోంది. తైషాన్ ప్లాంట్ నుంచి గ్యాస్ బయటకు వెళ్తున్నట్లు మే చివర్లో గుర్తించినట్లు ఫ్రాన్స్ సంస్థ తెలిపింది. జూన్ 3న అమెరికాకు చెందిన డిపార్టుమెంట్ ఆఫ్ ఎనర్జీకి(డీఓఈ) తెలియజేసింది. సమస్యను› పరిష్కరించేందుకు సహకరించాలని కోరింది. అమెరికా నుంచి స్పందన రాకపోవడంతో జూన్ 8న మరోసారి విజ్ఞప్తి చేసింది.
ప్లాంట్‌ను మూసివేసేందుకు చైనా యాజమాన్యం అంగీకరించడం లేదని పేర్కొంది. దీంతో అమెరికా పరిశోధకులు రంగంలో దిగారు. పరిస్థితి తీవ్రతను అంచనా వేశారు. ప్రజల ప్రాణాలను హరించే విపత్తుగా మారకముందే గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. తాము క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్లు ఫ్రామటోమ్ సంస్థ సోమవారం తెలియజేసింది. తైషాన్ ప్లాంట్ కూలింగ్ సిస్టమ్ నుంచి ప్రమాదకర వాయువులు వెలువడుతున్నట్లు ఫ్రాన్స్ ఇంధన సంస్థ ఈడీఎఫ్ సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
అలాంటి వాయువుల జాడలేదు
అణు విచ్ఛిత్తిలోని ఉప ఉత్పత్తుల్లో నోబుల్ గ్యాసెస్ ఉంటాయి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లోని కూలింగ్ వ్యవస్థలో ఈ వాయువుల ఉనికి ఉన్నట్లయితే రియాక్టర్ లీకలవుతున్నట్లు లెక్క. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో పెద్ద అణువును చిన్న అణువులుగా విచ్ఛిత్తి చెందిస్తారు. ఈ ప్రక్రియలో అత్యధిక ఉష్ణోగ్రతతోపాటు వృథా వాయువులు వెలువడుతుంటాయి. తైషాన్ ప్లాంట్‌ను చైనా ప్రభుత్వ పరిధిలోని జనరల్ న్యూక్లియర్ పవర్ గ్రూప్ నిర్వహిస్తోంది. ప్లాంట్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రమాదరకరమైన వాయువుల జాడ లేదని, పరిస్థితి మొత్తం సవ్యంగానే ఉందని ఈ గ్రూప్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్లాంట్ పరిసరాల్లో రేడియో ధార్మికత ఎంతుండాలనే దానికి ఒక పరిమితి ఉంటుంది. తాజా ఘటన నేపథ్యంలో చైనా ఈ పరిమితిని పెంచిందనే ఆరోపణలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment