నీరా టాండన్, జానెట్ యెల్లెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన(ప్రెసిడెంట్ ఎలెక్ట్) జోబైడెన్ కుక్కతో ఆడుకుంటూ జారిపడడంతో కాలికి గాయమైంది. ఆయన పాదంలో వెంట్రుకవాసి ఫ్రాక్చర్‌ను వైద్యులు గుర్తించారు. ఇది నయమయ్యేవరకు కొన్ని వారాల పాటు ఆయన వాకింగ్ బూట్ ధరించాల్సిఉంటుంది. బైడెన్ పెంచుకునే రెండేళ్ల వయసున్న జర్మన్ షెపర్డ్ కుక్క మేజర్‌తో ఆయన శనివారం ఆడుకుంటుండగా పాదం మెలికపడి జారిపడ్డారు. ఇటీవలే ఆయన 78వ పుట్టినరోజు జరుçపుకున్నారు. బైడెన్ జారిపడడంపై ట్రంప్ విచారం వ్యక్తం చేస్తూ ‘‘గెట్ వెల్ సూన్’’ అని ట్వీట్ చేశారు.
నీరా టాండన్‌కు కీలక పదవి
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై, త్వరలో బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్ తన పరిపాలనా బృందాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. కీలకమైన ఆఫీస్ ఆఫ్ ద మేనేజ్‌మెంట్, బడ్జెట్ డైరెక్టర్‌గా ఇండియన్–అమెరికన్ నీరా టాండన్(50), ఆర్థిక మంత్రిగా జానెట్ యెల్లెన్(74) పేర్లను సోమవారం ఖరారు చేశారు. వీరు బైడెన్ ఆర్థిక బృందంలో సేవలందించనున్నారు. ఈ నియామకాలకు అమెరికా సెనేట్ ఆమోద ముద్ర వేస్తే జానెట్ యెల్లెన్ కొత్త చరిత్ర సృష్టిస్తారు. 231 సంవత్సరాల అమెరికా చరిత్రలో ఆర్థిక విభాగాన్ని ముందుకు నడిపించే తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందుతారు.
అలాగే నీరా టాండన్ కూడా మరో ఘనత దక్కించుకుంటారు. ఆఫీస్ ఆఫ్ ద మేనేజ్‌మెంట్, బడ్జెట్ డైరెక్టర్‌గా నియమితులైన తొలి శ్వేత జాతేతర మహిళగా, తొలి ఇండియన్–అమెరికన్‌గా రికార్డుకెక్కుతారు. నీరా టాండన్‌కు కేబినెట్ స్థాయి పదవి దక్కుతుండడం భారతీయ అమెరికన్లకు గర్వకారణమని వెంచర్ క్యాపిటలిస్టు ఎంఆర్ రంగస్వామి చెప్పారు. ఆర్థికశాఖ సహాయ మంత్రిగా వాలీ అడెయెమో, కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్‌గా సెసీలియా రౌస్‌ను బైడెన్ ఖరారు చేశారు.
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా జెన్‌సాకీ
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా జెన్‌సాకీని నియమిస్తున్నట్లు బైడెన్ ప్రకటించారు. దీంతోపాటు తన ప్రభుత్వంలో కమ్యూనికేషన్ టీమ్‌లో మొత్తం మహిళలే ఉంటారని తెలిపారు. ఈ బృందంలో భాగంగా కేట్ బెడింగ్‌ఫీల్డ్‌ను వైట్‌హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా, కరేన్‌జీన్‌పియర్‌ను ప్రిన్సిపిల్ డిప్యుటీ ప్రెస్ సెక్రటరీగా, సైమోన్ సాండర్స్‌ను సీనియర్ అడ్వైజర్‌గా, ఎలిజబెత్ ఈ అలెగ్జాండర్‌ను ప్రథమ మహిళకు కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా, పిలి టోబర్‌ను డిప్యూటీ వైట్‌హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా, ఆష్లే ఎట్నిని ఉపాధ్యక్షురాలి కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా నియమించారు.
బాధ్యతల స్వీకార కార్యక్రమ కమిటీ
అధ్యక్షుడిగా వచ్చే జనవరి 20న జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్ల కమిటీని బైడెన్ వెల్లడించారు. కమిటీ సీఈవోగా డెలావర్ స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ టోనీ అల్లెన్‌ను, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన మజు వర్గీస్‌ను ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment