ఏపీ సెంట్రల్ డెస్క్: అమెరికాకు చెందిన టెస్సికా బ్రౌన్ టిక్‌టాక్ షోతో ఒక్కసారిగా పాపులర్ అయింది. అయితే అదేదో గొప్ప పనిచేసి కాదు. ఓ పిచ్చిపని చేసి. లూసియానాకు చెందిన ఈ నలభై ఏళ్ల టీచరమ్మ టిక్‌టాక్‌లో వివిధ రకాల కార్యక్రమాలతో అభిమానులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతింత కళ్లతో.. ఒత్తైన జుట్టుతో ఉండే టెస్సికా మేకప్ వేసుకుని అందంగా కనబడతూ ఉంటుంది. ఆమెను వేలాది మంది ఫాలో అవుతూ ఉంటారు.
అయితే ఓ రోజు తన జుట్టుపైనే ఓ ప్రయోగం చేసి అభిమానులను మెప్పించాలని ప్రయత్నించింది. జుట్టును అందంగా తీర్చిదిద్దుకోవడానికి చిట్కా అంటూ.. వీడియో మొదలెట్టింది. జట్టును ఇలా వేసుకోండి అంటూ ఓ బంక జిగురును తలకు పాముకుంది. అందరికీ సలహా ఇచ్చి వీడియో ముగించింది. ఇక ఆ జిగురును వదిలించుకోవడానికి తలంటు మొదలెట్టింది. ఆ జిగురు ఎంతకీ పోకపోయేసరికి ఆమెకు ఏమి చేయాలో పాలుపోలేదు. షాంపూతో పలుమార్లు తలంటింది. అయినా జిగురు వదల్లేదు. ఏవేవో ప్రయోగాలు చేసింది. ప్చ్.. జిగురు పోవడం మాట దేవుడెరుగు. మరింత బిగుసుకుపోయింది. లబోదిబో మంటూ మళ్లీ టిక్‌టాక్‌లోకి వచ్చింది. ఈ జిగురును ఎలా వదుల్చుకోవాలో సలహా ఇవ్వండి అంటూ తన అభిమానులను ప్రాధేయపడింది.
విమర్శలు.. సూచనలు..
ఆ జిగురు మామూలుది కాదు. హెవీ డ్యూటీ గొరిల్లా గ్లూ అది. స్ప్రే రూపంలో ఉండే ఈ జిగురును సిరామిక్, రాళ్లు, లోహాలను అతికించడానికి వాడతారు. టెస్సికా వీడియోను చూసిన టిక్‌టాక్ అభిమానులు ఇంక ఆడుకోవడం మొదలెట్టారు. ఆమెకు గొరిల్లా గ్లూ గర్ల్ అని పేరు పెట్టారు. ఆమె చేసిన పనిపై కొంతమంది విమర్శల వర్షం కురిపించారు. మరి కొందరు జాలి పడి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. అన్ని ప్రయత్నాలు చేసే సరికి ఆమెకు తలపై దురదతో పాటు చిన్న చిన్న కురుపులు మొదలయ్యాయి. అలాగే తలపోటు ఎక్కువైంది.
ఎన్ని చేసినా తలనంటిన జిగురు వదలక పోవడంతో చేసేది లేక ఆస్పత్రిని ఆశ్రయించింది. అక్కడ ప్లాస్టిక్ సర్జన్ చూసి ఈ జిగురును వదిలించాలంటే సుమారు తొమ్మిది లక్షల రూపాయలు (12000 డాలర్లు) ఖర్చు అవుతుందని తేల్చారు. మరో దారిలేక టెస్సికా ఆపరేషన్ చేయించుకుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. ఇదో బ్యాడ్, బ్యాడ్, బ్యాడ్ ఐడియా అంటూ వాపోయింది.
ఆ కంపెనీ ఏమందంటే..
మా కంపెనీ జిగురును తలకు రాసుకున్న టెస్సికాకు ఇలా జరగడం బాధాకరం. ఆమె వీడియో మా దృష్టికి వచ్చింది. ఆమె ఆస్పత్రిలో చేరి ట్రీట్మెంట్ చేయించుకుందని వీడియోలో చూశాం. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అంటూ సింపుల్‌గా చెప్పేసింది. అయితే టెస్సికాకు ఆమె తల్లి, నలుగురు అక్కచెల్లెళ్లు అండగా నిలిచారు. ఆమెకు సంఘీభావంగా వాళ్లు జట్టు కత్తిరించుకున్నారు. ఓ పిచ్చి పని నుంచి బయటపడ్డాను. ఇప్పుడు కోలుకుంటున్నాను అని టెస్సికా చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment