సన్నగిల్లిన బైడెన్‌ జ్ఞాపకశక్తి | USA: Joe Biden hits out at poor memory claims | Sakshi
Sakshi News home page

సన్నగిల్లిన బైడెన్‌ జ్ఞాపకశక్తి

Published Sat, Feb 10 2024 5:50 AM | Last Updated on Sat, Feb 10 2024 11:19 AM

USA: Joe Biden hits out at poor memory claims - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ జ్ఞాపకశక్తి తగ్గిందనే విషయాన్ని ఒక నివేదిక తగిన సాక్ష్యాధారాలతో బహిర్గతం చేయడంతో ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే బైడెన్‌ వృద్ధాప్యాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచు కున్న రిపబ్లికన్లకు తాజా నివేదిక మరో శక్తివంతమైన ప్రచారాస్త్రమైంది. అయితే ఈ నివేదికలోని అంశాలన్నీ తప్పు అని 81 ఏళ్ల బైడెన్‌ ఖండించినా ఆ నివేదికలో పేర్కొన్న విషయాలను గమనిస్తే అవన్నీ నిజాలే అని అనిపించకమానవు.

తక్కువ జ్ఞాపకశక్తి ఉన్న వృద్ధుడు అని బైడెన్‌ను నివేదిక అభివర్ణించింది. గత జనవరిలో వాషింగ్టన్‌లోని బైడెన్‌ కార్యాలయంలో రహస్య పత్రాలను సిబ్బంది కనిపెట్టడంతో ఆ విషయం అటార్నీ జనరల్‌ మెరిక్‌ గార్లాండ్‌దాకా వెళ్లింది. దీంతో ఆయన న్యాయశాఖ స్పెషల్‌ కౌన్సిల్‌గా రాబర్ట్‌ హుర్‌ను నియమించారు. ఈయన ఇటీవల బైడెన్‌ను ఏకధాటిగా ఐదు గంటలపాటు ఇంటర్వ్యూ చేసి ఆయన జ్ఞాపకశక్తిపై ఒక అంచనాకొచ్చారు. ఇదిగాక ఇతరత్రా సాక్ష్యాధారాలను ఆయన తన నివేదికలో వెల్లడించారు. గురువారం విడుదలైన ఆ 345 పేజీల నివేదికలో ఏమన్నాయంటే..

► బరాక్‌ ఒబామా హయాంలో ఉపా« ద్యక్షుడిగా పనిచేసినకాలంలో అఫ్గానిస్తాన్‌ లో అమెరికా స్థావరాలు, సైన్యం మొహరింపు రహస్యాలను ఒక ప్రైవేట్‌ వ్యక్తితో బైడెన్‌ పంచుకున్నారు. సంబంధిత రహస్య పత్రాలను డెలావర్‌లోని తన గ్యారేజీలో మర్చి పోయారు.
► తన కుమారుడు బ్యూ బైడెన్‌ క్యాన్సర్‌ తో ఏ సంవత్సరంలో చనిపోయిందీ బైడెన్‌ ఠక్కున చెప్పలేకపోయారు
► ఉపాధ్యక్షుడిగా ఏ సంవత్సరంలో దిగిపోయారు అనేదీ ఈయనకు సరిగా గుర్తులేదు
► తన జీవితచరిత్ర రాస్తున్న ఒక రచయితకు సున్నితమైన అంశాలున్న ఒక నోటు పుస్త కం ఇచ్చారు. అందులో అఫ్గానిస్తాన్‌కు సంబంధించిన రహస్య సమాచారం ఉంది.

అవన్నీ అబద్ధా్దలు: బైడెన్‌
‘దాదాపు 40 సంవత్సరాల క్రితం విషయాలను ఠక్కున చెప్పాలంటే ఎలా?. నా కుమారుడి మరణాన్ని చర్చించకూడదనే ఆ ప్రశ్న సమయంలో స్పందించలేదు. రెండోసారీ అమెరికాకు అధ్యక్షుడిగా కొనసాగే శక్తిసామర్థ్యాలు నాకున్నాయి’’అని బైడెన్‌ పనరుద్ఘాటించారు. అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలపై తడబడుతూ, పొరబడటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement