రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ధీమా
తూటాల దాడి జరిగినా నా సంకల్పం చెక్కుచెదరలేదు
అధికారం అప్పగించండి మిమ్మల్ని తలెత్తుకొనేలా చేస్తా
అమెరికాను సురక్షితమైన, బలమైన దేశంగా మార్చడమే ధ్యేయం
మిల్వాకీలో రిపబ్లికన్ జాతీయ సదస్సులో ట్రంప్ ప్రసంగం
మిల్వాకీ: హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న అమెరికా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(78) సమరోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. భగవంతుడు తనవైపు ఉండడం వల్లే పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని చెప్పారు. భగవంతుడి దయతోనే మళ్లీ జనం ముందుకు వచ్చానని పేర్కొన్నారు. మరో నాలుగు నెలల్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. హత్యాయత్నం ఘటన తర్వాత తొలిసారిగా మిల్వాకీలో గురువారం రాత్రి జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో ట్రంప్ భావోద్వేగంతో ప్రసంగించారు.
రిపబ్లికన్ అభ్యరి్థగా తన నామినేషన్‌ను లాంఛనంగా ఆమోదించారు. తూటాల దాడి జరిగినా తన సంకల్పం చెక్కుచెదరలేదని, అమెరికా ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. దేశాన్ని కాపాడాలన్న నా తపనను ఏ ప్రమాదం, ఏ అవరోధం అడ్డుకోలేవని తేలి్చచెప్పారు. హత్యాయత్నం తర్వాత తనపై ప్రేమాభిమానాలు కురిపించి, మద్దతు ప్రకటించిన ప్రజలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆత్మవిశ్వాసం, ఆశ, బలం అనే సందేశాన్ని మోసుకొని ఈరోజు అమెరికన్ల ముందుకు సగర్వంగా వచ్చానని అన్నారు. పార్టీ సదస్సులో ట్రంప్ ఇంకా ఏం మాట్లాడారంటే...
నూతన యుగానికి ఆరంభం
‘‘మరో నాలుగు నెలల్లో మనం అద్భుతమైన విజయం సొంతం చేసుకోబోతున్నాం. అమెరికా చరిత్రలో నాలుగు అతిగొప్ప సంవత్సరాలకు శ్రీకారం చుట్టబోతున్నాం. మతం, రంగు, జాతితో సంబంధం లేకుండా ప్రజలందరికీ భద్రత, సౌభాగ్యం, స్వేచ్ఛ కలి్పంచే నూతన యుగాన్ని మనమంతా కలిసికట్టుగా ఆరంభిద్దాం. మన సమాజంలో ప్రజల మధ్య అడ్డుగోలకు తావు లేకుండా చేద్దాం. అమెరికన్లుగా మనది ఒకేబాట, ఒకేమాట. మనం ఐక్యమత్యంగా ఉండాలి. అందరం కలిసి పైకి ఎదగాలి. కలిసి ఉండలేకపోతే నష్టపోతాం. సగం అమెరికాకు కాదు, మొత్తం అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు బరిలో నిల్చున్నా.
మనం ఒకే దేశం బిడ్డలం
నాపై హత్యాయత్నం జరిగిన సంగతి అందరికీ తెలుసు. అసలేం జరిగిందని చాలామంది అడుగుతున్నారు. నా శరీరం నుంచి అంగుళంలో మూడోవంతు దూరంలో తుపాకీ తూటా దూసుకెళ్లింది. నా తల రక్తంతో తడిసిపోయింది. దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డా. ఈ విషయం మరోసారి నేను పంచుకోలేను. ఎందుకంటే అది చాలా బాధాకరమైన అనుభవం. మాటల్లో చెప్పలేనిది. నాపై క్రూరమైన దాడి జరిగిన తర్వాత మన ఐక్యత మరింత పెరిగింది. మన సంకల్పం, ఉద్దేశం ఏమాత్రం మారలేదు. అమెరికాను మరోసారి గెలిపించాలి. అమెరికాను మళ్లీ సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన గొప్పదేశంగా మార్చాలి. మనం ఒకే దేశం బిడ్డలం. రాజకీయపరమైన అంశాలు మన మధ్య విభజన రేఖలు గీయకూడదు.
ఈ ఎన్నికలు అత్యంత కీలకం
యావత్తూ దేశానికి ఒక దార్శనికతను నిర్దేశించడానికి ఇక్కడికి వచ్చా. ఈ సందర్భంగా దేశంలో ప్రతి పౌరుడికీ స్నేహ హస్తం అందిస్తున్నా. వారికి విధేయత ప్రకటిస్తున్నా. ప్రపంచం ఎన్నడూ చూడని విధంగా అమెరికాను నూతన శిఖరాల వైపు నడిపిద్దాం. నా నాయకత్వంలో అమెరికా మళ్లీ గౌరవం పొందుతున్న విశ్వాసం ఉంది. మన బల సంపన్నతను ఏ దేశమూ ప్రశ్నించలేదు. మన శక్తి సామర్థ్యాలను ఏ శత్రువూ అనుమానించలేరు. మన సరిహద్దులు భద్రంగా ఉంటాయి. మన ఆర్థిక వ్యవస్థ ఉజ్వలంగా మారుతుంది. మన భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవాలంటే విఫలమైన నాయకత్వం నుంచి దేశాన్ని తొలుత రక్షించుకోవాలి. అమెరికా చరిత్రలో ఈ ఎన్నికలు అత్యంత కీలకం.
శత్రుదుర్భేద్యంగా మారుస్తా
అక్రమ వలసలు అమెరికాకు పెద్ద సమస్యగా మారాయి. దక్షిణ సరిహద్దు నుంచి పోటెత్తుతున్న వలసలు, చొరబాట్లు దేశమంతటా కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అక్రమ వలసల కారణంగా నేరాలు, పేదరికం, వ్యాధులు, విధ్వంసం పెరుగుతున్నాయి. ప్రపంచమంతటా ఇలాంటి వలసల సంక్షోభం కనిపిస్తోంది. మరోవైపు యూరప్, మధ్యప్రాచ్యంలో యుద్ధాలు కొనసాగుతున్నాయి.
తైవాన్, కొరియా, ఫిలిప్పైన్స్‌లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. కేవలం ఆసియా ఖండమే కాదు, మొత్తం భూగోళం నేడు మూడో ప్రపంచ యుద్ధం అనే అంచుపై ఉందని చెప్పక తప్పదు. ఈ పరిస్థితి మారాలన్నదే నా ఆశ. తైవాన్‌ను చైనా చుట్టుముడుతోంది. అమెరికా సమీపంలో రష్యా యుద్ధ నౌకలు, అణు జలాంతర్గాములు చెక్కర్లు కొడుతున్నారు. ఈ విషయాలు ప్రస్తావించేందుకు మీడియా ఇష్టపడడం లేదు. నేను అధికారం చేపట్టిన తర్వాత మన భూభాగాలను శత్రు దుర్భేద్యంగా మారుస్తా.
మార్పునకు సమయమిదే
అమెరికాలో మార్పునకు సమయం ఆసన్నమైంది. ఇప్పుడున్న పరిపాలనను మరో నాలుగేళ్లు మనం భరించలేం. అందుకే మార్పునకు పట్టం కట్టాలి. అమెరికా పౌరుల ఎదుట ఈ క్షణాన ప్రతిజ్ఞ చేస్తున్నా. ద్రవ్యోల్బణ సంక్షోభాన్ని అంతం చేస్తా. వడ్డీ రేట్లను తగ్గిస్తా. మన సరిహద్దును మూసివేస్తా. గోడ నిర్మాణం పూర్తిచేస్తా. అక్రమ వలసలకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తా. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి శుభం కార్డు వేసేస్తాం. నేను అధికారంలో ఉండి ఉంటే ఈ యుద్ధాలు అసలు జరిగేవే కాదు. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో నా విజయానికి సహరించాలని అందరినీ సవినయంగా కోరుతున్నా. మిమ్మల్ని తలెత్తుకొనేలా, గర్వపడేలా చేయడమే నా ధ్యేయం.
Comments
Please login to add a commentAdd a comment