వాషింగ్టన్: అమెరికాలో ఉంటూ ఏళ్ల తరబడి గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న 80 లక్షల మందికి శుభవార్త ఇది. వీరికి శాశ్వత నివాస హోదా కల్పించే కార్డును మంజూరు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును డెమోక్రాటిక్ పార్టీకి చెందిన నలుగురు సభ్యుల బృందం సెనేట్‌లో ప్రవేశపెట్టింది. ఇమిగ్రేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ సెనేటర్లు అలెక్స్ పడిల్లా, ఎలిజబెత్ వారెన్, బెన్ రే లుజాన్, సెనేట్ మెజారిటీ విప్ డిక్ డర్బన్ బుధవారం ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
దీని ప్రకారం.. అమెరికాలో వరుసగా కనీసం ఏడేళ్లపాటు నివాసం ఉన్న వలసదారు చట్టబద్ధమైన శాశ్వత నివాస అర్హత పొందవచ్చు. ‘గతంలో సవరించిన ఇమిగ్రేషన్ విధానం ఎందరికో ఇబ్బందికరంగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. మా బిల్లులో గత 35 ఏళ్లలోనే మొదటిసారిగా రిజిస్ట్రీ కటాఫ్ తేదీని సవరించాం. దీనితో మరింతమంది వలసదారులు చట్టబద్ధ శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’అని సెనేటర్ పడిల్లా చెప్పారు.
‘దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉండి పనులు చేసుకుంటూ అభివృద్ధిలో తమ వంతు తోడ్పాటునందిస్తున్న లక్షలాది మంది వలసదారులు అనిశ్చితితో భయపడాల్సిన అవసరం లేకుండా ఇకపై స్వేచ్ఛగా జీవించవచ్చు’అని ఆయన అన్నారు. ‘‘ఈ బిల్లు కార్యరూపం దాలిస్తే డ్రీమర్లు, లాంగ్ టర్మ్ వీసాదారుల సంతానం, అత్యవసర సిబ్బంది, హెచ్–1బీ వీసాలు కలిగిన అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు తదితర 80 లక్షల మందికి ప్రయోజనం ఉంటుంది’’ అని వలసదారుల తరఫున పనిచేసే ఎఫ్‌డబ్ల్యూడీ డాట్ యుఎస్ అంచనావేసింది. ‘చట్టపరమైన అడ్డంకి వల్ల వలసదారులు గ్రీన్‌కార్డుకు నోచుకోలేకపోతున్నారని హౌస్ సబ్ కమిటీ సారథి లోఫ్‌గ్రెన్ అన్నారు. ఈ పరిణామాన్ని ఆశావహులు స్వాగతించారు.
Comments
Please login to add a commentAdd a comment