
కరోనా అంటే హడలెత్తే రోజులు పోయాయి. ముఖాన మాస్కు, చేతిలో శానిటైజర్ ఉందంటే కరోనా కాదు కదా దాని మమ్మీలాంటి వైరస్ వచ్చినా ఏం చేయలేదు అన్న ధైర్యానికి జనాలు వచ్చేశారు. ఇక వైరస్ సోకినవారిలో సగం మందికి లక్షణాలు బయటపడుతుంటే మిగతా సగం జనానికి వైరస్ సోకిందన్న సంగతి కూడా తెలియడం లేదు. కాగా కరోనా లక్షణాలలో మొట్టమొదటిది రుచీవాసన తెలీకపోవడం. అది ఏ రేంజ్‌లో ఉంటుందనేది రసెల్ డనేలీ అనే వ్యక్తి జనాలకు తెలియజేయాలనుకున్నాడు. దీంతో వంటింట్లో ఉండే సామానంతా తన ముందు పెట్టుకుని వీడియో ఆన్ చేశాడు. పచ్చి ఆహారాన్ని పుష్టిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా తినడం మొదలుపెట్టాడు. ఉల్లిపాయలు, వెల్లుల్లి పేస్ట్, బేబీ ఫుడ్ ఇలా తింటూనే ఉన్నాడు. (ఫోటో షూట్.. మరోరకం ట్రెండింగా..?)
వంటకాల్లో ఉపయోగించే నిమ్మరసం, ఆపిల్ సైడ్ వెనిగర్‌ను గుట గుటా తాగేశాడు. నిమ్మకాయను నమిలి నమిలి మింగేశాడు. టూత్‌పేస్టును కూడా తినేందుకు ప్రయత్నించాడు. చిత్రవిచిత్రమైనవన్నీ తింటున్నా ఎలాంటి రుచీపచీ తెలీకపోవడంతో ఇదో క్రేజీ వైరస్ అని చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు 17 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో తీయడం గురించి రసెల్ మాట్లాడుతూ.. తాను ఏ వాసన పసిగట్టలేకపోతున్నాని, నాలుకకు రుచి తెలీట్లేదని చెప్తే తన స్నేహితులు నమ్మలేరని తెలిపాడు. ఈ వీడియోతో వారికి సమాధానం దొరుకుతుందని చెప్పుకొచ్చాడు. (భావోద్వేగ దృశ్యం: కన్నీళ్లు ఆగడం లేదు)