హనోయి: వరండాలో బొమ్మలతో ఆడుకుంటున్న ఓ బుడ్డోడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఆ పిల్లాడి తండ్రి వేగంగా స్పందించడంతో పాము కాటు నుంచి తప్పించుకోగలిగాడు. వియత్నాంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాలు.... ఓ పిల్లాడు ఇంటి ముందర కూర్చుని బొమ్మలతో ఆడుకుంటున్నాడు. ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకున్న తాత అతడికి రక్షణగా అక్కడే నిలబడి ఉన్నాడు. ఇంతలో ఓ పాము వేగంగా ఇంట్లోకి దూసుకురావడం గమనించాడు. కానీ, అనారోగ్య కారణాల దృష్ట్యా బాబును చేతుల్లోకి తీసుకోలేకపోయాడు. అయితే వెంటనే అప్రమత్తమై, ఇంట్లో ఉన్న పిల్లాడి తండ్రిని పిలిచాడు.
దీంతో అతడు క్షణాల వ్యవధిలో అక్కడికి చిన్నారిని ఇంట్లోకి తీసుకువెళ్లాడు. ముగ్గురూ లోపలికి వెళ్లిన తర్వాత వెంటనే తలుపు మూసేశాడు. ఇక ఇంటి లోపలికి వెళ్లేందుకు విఫలయత్నం చేసిన పాము.. ఎంతకీ వీలుకాకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో... ‘‘వామ్మో.. ఎంత పెద్ద పాము.. క్షణాల్లో ఎలా దూసుకువచ్చింది... కాస్త ఆలస్యమైతే బాబుకు ఏమయ్యేదో.. ఎలాగైతేనేం బుడ్డోడు సేఫ్ అయ్యాడు. చిన్నారులను ఎల్లప్పుడూ ఓ కంట కనిపెట్టుకునే ఉండాలి’’ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment