జెనివా: కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ ఏది అందుబాటులోకి రాలేదు. ఇతర వ్యాధుల చికిత్స కోసం వాడుతున్న కాంబినేషనల్ డ్రగ్స్‌ని ప్రస్తుతం కోవిడ్ చికిత్సలో ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కోవిడ్ ట్రీట్‌మెంట్ కోసం వాడుతున్న రెమెడిసివర్ ఔషధంతో అతి తక్కువ లేదా అసలు ఎలాంటి ప్రభావం లేదని తెలిపింది. రెమెడిసివర్ తీసుకున్న రోగులు కోలుకోవడం లేదా వారి జీవితకాలం పెరగడం వంటి ఫలితాలు కనిపించలేదని డబ్ల్యూహెచ్‌ఓ సర్వే తెలిపింది. కరోనా వైరస్ చికిత్స కోసం ఉపయోగించిన మొట్ట మొదటి యాంటీవైరల్ మందు రెమెడిసివర్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చికిత్సలో భాగంగా దీన్ని కూడా ఉపయోగించారు. ఇలాంటి తరుణంలో డబ్ల్యూహెచ్‌ఓ సర్వే తెలిపిన విషయాలు కాస్త ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 30 కంటే ఎక్కువ దేశాలలో దాదాపు 11,266 మంది కోవిడ్ రోగుల మీద రెమెడిసివర్, హైడ్రాక్సీక్లోరోక్విన్, యాంటీ-హెచ్‌ఐవీ డ్రగ్ లోపినావిర్/రిటోనావిర్, ఇంటర్ఫెరాన్ల కాంబినేషన్లను ఉపయోగిస్తున్నారు. (షాకింగ్ : ఆ వ్యాక్సిన్ పరీక్షలు నిలిపివేత )
ఈ క్రమంలో డబ్ల్యూహెచ్‌ఓ వీటి ప్రభావాలను అంచనా వేయడానికి సాలిడారిటీ ట్రయల్ నిర్వహించింది. దీనిలో తెలిసింది ఏంటంటే రెమెడిసివర్‌తో సహా మిగిలిన ఔషధాలు కోవిడ్ రోగులకు ఇచ్చే 28 రోజుల కోర్సులో అతి తక్కువ ప్రభావం లేదా అసలు ఎలాంటి ప్రభావం చూపలేదని అధ్యాయనం వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ నెల ప్రారంభంలో అమెరికా గిలియడ్, రెమెడిసివర్‌పై చేసిన ప్రయోగాల్లో ప్లాసిబో తీసుకునే వారితో పోలీస్తే ఈ ఔషధం తీసుకున్న కోవిడ్ రోగుల్లో.వారు కోలుకునే సమయాన్ని ఐదు రోజులకు తగ్గించినట్లు తెలిపింది. వీరు 1,062 మీద పరీక్షించారు. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌ఓ ఇందుకు విరుద్ధమైన అంశాలు వెల్లడించడం గమనార్హం. ఈ సందర్భంగా గిలియడ్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. ‘డబ్ల్యూహెచ్‌ఓ డాటా అస్థిరంగా ఉంది. పీర్-రివ్యూ జర్నల్స్‌లో ప్రచురించబడిన మల్టిపుల్ రాండమైజ్డ్, నియంత్రిత అధ్యయనాల నుంచి మరింత బలమైన సాక్ష్యాలు రెమెడిసివిర్ క్లినికల్ ప్రయోజనాన్ని ధృవీకరిస్తాయి’ అని తెలిపారు. (వ్యాక్సిన్ : వారు 2022 వరకు ఆగాల్సిందే!)
డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ బుధవారం మాట్లాడుతూ, ‘జూన్‌లో నిర్వహించిన అధ్యయనంలో, హైడ్రాక్సీక్లోరోక్విన్, లోపినావిర్ / రిటోనావిర్ పనికిరానివని తేలింది. దాంతో వాటిని నిలిపివేశాము. అయితే 30కి పైగా దేశాల్లో 500 ఆస్పత్రుల్లో ఇతర పరీక్షలు కొనసాగుతున్నాయి’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment