
జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం
జగిత్యాల జోన్: అజాగ్రత, నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తు.. ఇలా కారణాలు ఏవైనా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతకంటే వేగంగా ఈ సంఖ్య పెరుగుతోంది. అయితే, సరైన ధ్రువీకరణ పత్రాలు లేక బాధితులకు పరి హారం అందడం లేదు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమా లేకపోవడం ఇందుకు కారణమవుతోంది. జిల్లాలో 2022 సంవత్సరంలో 450 వరకు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఒక్క జగిత్యాల జిల్లాలోనే జరిగిన యాక్సిడెంట్లను పరిశీలిస్తే.. 200 మంది మరణించగా, 150 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఇక క్షతగాత్రుల సంఖ్య వందల్లో ఉంటుంది. మరణించిన లేదా గాయపడ్డ వారిలో కుటుంబ పెద్ద ఉంటే, బాధిత కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. బాధితుల్లో పేదలు, మధ్యతరగతివారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
జగిత్యాల మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రమేశ్ తన పని నిమిత్తం ఇటీవల జగిత్యాలకు వచ్చాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టడడంతో చేయి విరిగింది. డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఆటోకు ఇన్సూరెన్సు లేదు. పెద్దమనుషులు జోక్యం చేసుకుని బాధితుడికి ఆటో డ్రైవర్ నుంచి రూ.10వేల పరిహారం ఇప్పించారు. డ్రైవర్‌కు లైసెన్స్, ఆటోకు బీమా సౌకర్యం ఉంటే బాధితుడు కోర్టులో కేసు వేసే అవకాశం ఉండేది. తద్వారా పరిహారం అధికంగా వచ్చి ఉండేది.
బీమా లేమి బాధితులకు శాపం..
● ద్విచక్ర వాహనం నుంచి భారీ వాహనాల వరకు మోటారు వాహన చట్టం ప్రకారం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలి.
● కానీ, చాలా ప్రమాదాలకు కారణమైన వాహనాలకు బీమా సౌకర్యం ఉండడంలేదు.
● దీంతో బాధితులు, వారి కుటుంబాలకు సంస్థల నుంచి పరిహారం అందడం లేదు.
● వాహనాలు నడిపే వారిలో చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండటం లేదు.
● వాహనాలు నడపడంలో అనుభవం లేక తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
● ప్రమాదం జరిగిన సమయంలో పోలీసు, రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేసే వరకే పరిమితమవుతున్నారు.
● పోలీసులు అడపాదడపా వాహనాలు తనిఖీలు చేస్తూ నిబంధనలు అతిక్రమిస్తే రూ.500– రూ.1,000 వరకు జరిమానా విధిస్తున్నారు.
● వాహనం నడిపే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి ఇన్సూరెన్స్ లేలకుంటే జరిగే నష్టంపై అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు.
బాధితుల వేదనలు వర్ణణాతీతం..
రోడ్డు ప్రమాదాల్లో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాల బాధలు వర్ణణాతీతంగా ఉంటున్నాయి. ఇంటిపెద్ద చనిపోయి ఆ కుటుంబం రోడ్డున పడుతుంటే.. గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు అప్పులు చేయక తప్పడంలేదు. బాధితులు కూడా నెలల తరబడి మంచానికే పరిమితం కావడం ఆ కుటుంబాల్లో మానసిక సమస్యలకు కారణమవుతోంది. పరిహారం కోసం కోర్టులో కేసు వేయడం, గెలవడం బాధిత కుటుంబాలకు సవాల్‌గానే మారుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చుతున్నారు. కానీ, కేసు ఎప్పుడు ముగుస్తుందో, ఎప్పుడు పరిహారం వస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది.
పరిహారం కోసం కేసు వేయాల్సిందే..
● ప్రమాద బాధితులు తమకు జరిగిన నష్టంపై పరిహారం కోరుతూ కోర్టులో కేసులు దాఖలు చేస్తేనే ఎక్కువ పరిహారం వచ్చే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు.
● పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. డ్రైవర్, వాహన యజమాని, బీమా సంస్థకు నోటీసులు జారీ చేస్తుంది.
● అయితే, కోర్టు వరకు వచ్చిన చాలా కేసుల్లో డ్రైవర్‌కు లైసెన్స్, వాహనాలకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండటం లేదు.
● బాధితులకు పరిహారం చెల్లించాలని కోర్టు వాహన యజమానులకు ఆదేశాలు జారీ చేస్తున్నా.. యజమాని పరిహారం చెల్లించే స్థితిలో ఉన్నా.. బాధితుడికి పరిహారం అందడం లేదు.
● డ్రైవర్‌కు లైసెన్స్ లేకుండా, వాహనానికి ఇన్సూరెన్స్ ఉన్నా.. ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం ఇవ్వడం లేదు.
● దీంతో, పెద్దమనుషులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను ‘ఎంతోకొంత’కు రాజీ చేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ఎంతో కొంత మొత్తానికి ఒప్పందాలు చేసుకుంటున్నారు.
రూ.10 వేలే ఇచ్చారు
ఏడాది క్రితం పెగడపల్లి వెశ్తుండగా ఒకరు ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. కాలు విరిగింది. రెండు నెలలు ఇంటివద్దే ఉన్న. ఇప్పటికీ నడవడం రావడంలేదు. మోటర్‌సైకిల్‌కు ఇన్సూరెన్స్‌లేదు. డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఆ వ్యక్తి కాళ్లావేళ్లా పడి రూ.10వేలు నా చేతిలో పెట్టిండు. నేను ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటే రూ.60వేల వరకు ఖర్చు వచ్చింది.
– రాజిరెడ్డి, రఘురాములకోట, జగిత్యాల రూరల్
ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే పరిహారం
వాహనం, డ్రైవర్‌కు సరైన ధ్రువీకరణ పత్రాలు లేక రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందడంలేదు. వాహనాలు, వాహనదారులు తగిన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి.
– డబ్బు లక్ష్మారెడ్డి, అడ్వకేట్, జగిత్యాల
ముమ్మరంగా వాహనాల తనిఖీ
జిల్లాలో వాహనాల తనీఖీ ముమ్మరంగా చేపట్టాం. వీలైనంత వరకు రోడ్డు ప్రమాదాలు నియంత్రిస్తున్నాం. ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేని వాహనదారులకు జరిమానా విధిస్తున్నాం. నష్టంపై అవగాహన కల్పిస్తున్నాం.
– భాస్కర్, ఎస్పీ