జ్యోతినగర్(రామగుండం): మాటలకందని విషాదం.. మరికొన్ని రోజుల్లో ప్రవసం జరిగి, ఆ ఇంట్లోకి శిశువు రానుందన్న వారి ఆనందాన్ని రోడ్డు ప్రమాదం క్షణాల్లో తీసుకెళ్లిపోయింది. కారు రూపంలో వచ్చిన మృత్యువు ఓ గర్భిణిని కబళించింది. భర్తతో కలిసి స్కూటీపై వెళ్తున్న ఆమెను వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో గర్భిణి తీవ్రంగా గాయపడి, మృతిచెందింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన నిహారిక, రామగుండం మండలంలోని మల్యాలపల్లెకు చెందిన కత్తెరమల్ల క్రాంతి ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఆమె ఓ మెగా మార్కెట్‌లో పని చేస్తోంది. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. ఆధార్ అప్‌డేట్ కోసం భర్తతో సోమవారం స్కూటీపై ఎన్టీపీసీ రామగుండం వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్తుండగా క్రషర్‌నగర్ రాజీవ్ రహదారిపై పెద్దపల్లి వైపు వెళ్తున్న కారు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నిహారికను గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు.
కడుపులో ఉన్న శిశువు కళ్లు తెరవకుండానే ప్రాణాలు విడిచింది. కొన్ని నిమిషాల్లో ఇంటికి చేరేవారని, ఈలోగా ఇంత ఘోరం జరిగిందంటూ మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రిలో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎన్టీపీసీ ఎస్సై బి.జీవన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రికి వెళ్లి, మృతురాలి భర్త నుంచి ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
డీసీసీ అధ్యక్షుడి పరామర్శ..
పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు రాజ్‌ఠాగూర్ మక్కాన్ సింగ్ గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో నిహారిక మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఆయన వెంట నాయకులు ఫకృద్దీన్, మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేశ్, రామగుండం పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శిరిషెట్టి సతీశ్, మడ్డి తిరుపతి గౌడ్, బరుపాటి శ్రీనివాస్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment