కథలాపూర్ (వేములవాడ): ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు సహజం. ప్రజాప్రతినిధులకు మాత్రం పదోన్నతులు ఉండవు. కానీ కథలాపూర్ జెడ్పీటీసీలుగా పదవీ బాధ్యతలు చేపట్టిన మహిళా నేతలిద్దరికీ ఎమ్మెల్యేగా బరిలో నిలిచే అవకాశం రావడం విశేషం. మండలంలోని భూషణరావుపేట గ్రామానికి చెందిన అంబల్ల భాగ్యవతి జెడ్పీటీసీగా పనిచేసి గతంలో ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. బీమారం మండలం మోత్కురావుపేట గ్రామానికి చెందిన తుల ఉమ కథలాపూర్ జెడ్పీటీసీగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా బరిలో ఉంటున్నారు.
అప్పడు భాగ్యవతి.. ఇప్పుడు తుల ఉమ
మండలంలోని భూషణరావుపేటకు చెందిన అంబల్ల భాగ్యవతి కథలాపూర్ జెడ్పీటీసీగా 1995 సంవత్సరం నుంచి 2000 వరకు, ఎంపీపీగా 1987 సంవత్సరం నుంచి 1992 వరకు పనిచేశారు. 2001లో బుగ్గారం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి ద్వితీయ స్థానానికి పరిమితమయ్యారు. బీమారం మండలం మోత్కురావుపేట గ్రామానికి చెందిన తుల ఉమ 2014 సంవత్సరంలో కథలాపూర్ జెడ్పీటీసీగా గెలుపొంది ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా 2019 వరకు పనిచేశారు. ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా తుల ఉమ బరిలో ఉంటున్నారు. మండలంలో మండలస్థాయి ప్రజాప్రతినిధులుగా సేవలందించినవారికి ఎమ్మెల్యేగా బరిలో ఉండే అవకాశం రావడంపై మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment