వన్యప్రాణుల దాహం తీర్చేలా
● అడవుల్లో 140 సాసర్‌పిట్స్ ఏర్పాటు ● మూడు సోలార్ బోర్ల నిర్మాణం ● అడవినుంచి బయటకు రాకుండా..
జగిత్యాలక్రైం: అడవుల్లోని వన్యప్రాణులు వేసవిలో నీటి కోసం తపిస్తున్నాయి. ఈ క్రమంలో అటవీప్రాంతం నుంచి బయటకు వస్తుండటంతో కుక్కలు, వేటగాళ్ల బారిన పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రమాదవశాత్తు బావుల్లో పడి మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. వాటికి అడవుల్లోనే నిత్యం నీటిని అందుబాటులో ఉంచుతున్నారు. జిల్లాలోని ఐదు రేంజ్‌ల పరిధిలో 53 వేల హెక్టార్లలో అటవీ విస్తరించి ఉంది. ఈ అడవుల్లో ఉండే వన్యప్రాణులు వేసవికాలంలో నీటికోసం బయటకు వచ్చి ప్రమాదాల బారిన పడకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.
140 సాసర్‌పిట్స్ నిర్మాణం
జిల్లావ్యాప్తంగా గతంలో ఉన్నవాటితోపాటు నీటి నిలవ పెంచేందుకు మొత్తం 140 సాసర్‌పిట్స్, సర్కులేషన్ ట్యాంకుల నిర్మించారు. ట్యాంకర్ల ద్వారా అక్కడున్న నీటి వసతి ద్వారా సాసర్‌పిట్స్ నింపుతున్నారు.
నీటి నిల్వ పెంచుతున్న చెక్‌డ్యామ్‌లు
జిల్లాలోని అడవుల్లో భూగర్భజలాలు పెంచేందుకు ఇప్పటికే 47 చెక్‌డ్యామ్‌లను నిర్మించారు. వీటితోపాటు 112 నీటి కుంటలున్నాయి. వర్షం నీరు వృథాగా పోకుండా అడ్డుకట్ట వేసి చెక్‌డ్యామ్‌లు, నీటి కుంటల్లో నీరు నిల్వ చేస్తున్నారు. ఆ నీటిని వన్యప్రాణులు తాగుతూ దాహార్తి తీర్చుకుంటున్నాయి. మరోవైపు అడవుల్లో భూగర్భజలాలు కూడా పైకి వస్తున్నాయి. ఫలితంగా చెట్లు కూడా విస్తారంగా పెరిగేందుకు దోహదపడుతున్నాయి.
మూడు సోలార్ బోర్లు
అటవీప్రాంతంలో మూడు సోలార్ బోర్లు ఏర్పాటు చేశారు. అందులో లభించే నీటి ఆధారంగా ప్రస్తుతం మరికొన్ని బోర్లు వేసేందుకు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రెండు సోలార్ బోర్లు ఏర్పాటు చేశారు. వీటికి సోలార్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు..
అటవీ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణులకు వేసవి దృష్ట్యా నీటి వసతులు కల్పించాం. వన్యప్రాణులు బయటకు రావడంతో ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో ప్రత్యేకంగా నీటి వసతి కల్పించి వాటి దాహార్తి తీర్చేలా చర్యలు చేపట్టాం.
– రవిప్రసాద్, జిల్లా అటవీశాఖ అధికారి
వన్యప్రాణుల దాహం తీర్చేలా
వన్యప్రాణుల దాహం తీర్చేలా
వన్యప్రాణుల దాహం తీర్చేలా
Comments
Please login to add a commentAdd a comment