ఇసుక కొరత తీరేదెప్పుడో..
మెట్‌పల్లి: జిల్లాలో ఇసుక కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో రీచ్‌లు గానీ, స్టాక్ పాయింట్లు గానీ లేకపోవడంతో నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. ఇంతకాలం జిల్లా అంతటా అక్రమంగా ఇసుక విక్రయాలు సాగుతూ వచ్చాయి. అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టింది. అనుమతులు లేకుండా ఇసుక తరలించే వాహనదారులకు భారీగా జరిమానాలు విధించడంతోపాటు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ చర్యలతో చాలావరకు అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడగా.. మరోవైపు ఇసుక కొరతకు దారి తీయడం ప్రజలకు ఇబ్బందిగా మారింది.
కేవలం ఐదు చోట్లనే రీచ్‌లు
● జిల్లాలో ఇప్పటివరకు కోరుట్ల మండలం పైడిమడుగు, కథలాపూర్ మండలం సిరికొండ, రా యికల్ మండలం ఇటిక్యాల, మల్లాపూర్ మండలం సాతారాం, మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ వాగుల్లో ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేశారు.
● ఈ ఐదింటిలో విక్రయాలు ప్రారంభించారు.
● ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ.800 ప్రభుత్వానికి చెల్లించేలా నిబంధన విధించారు.
● ఇవే కాక ధర్మపురి మండలంలో రెండు, బీర్‌పూర్ మండలంలో ఒకచోట రీచ్‌లను ఏర్పా టు చే యాలని ప్రతిపాదించినప్పటికీ ఇంకా వాటికి అనుమతులు రాలేదని తెలిసింది.
● జిల్లా మొత్తంగా 20మండలాలు ఉండగా.. కేవలం ఐదుచోట్ల మాత్రమే రీచ్‌లతో సరిపెట్టారు.
● మిగతా మండలాల్లో అక్కడి పరిస్థితులను బట్టి రీచ్‌లుగానీ, స్టాక్ పాయింట్లు గానీ ఏర్పాటు చేయకపోవడంతో అయా ప్రాంతాల్లో ఇసుక దొరకక నిర్మాణదారులు అవస్థలు పడుతున్నారు.
ఇలా చేస్తే మేలు..
● కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి అవకాశం ఉంటే రీచ్‌లు..లేని పక్షంలో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి ఇసుక సరఫరా చేయాలి.
● ఇంతకాలం జిల్లా అంతటా అక్రమ ఇసుక విక్రయాలు సాగాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం దక్కలేదు. ప్రస్తుతం కొన్నిచోట్ల రీచ్‌లు ఏర్పాటు చేశారు. మిగతా చోట్ల కూడా రీచ్‌లు, స్టాక్ పాయింట్లు నెలకొల్పితే భారీగా ఆదాయం సమకూరుతుంది.
● ఇసుక వ్యాపారం చేసుకుంటూ వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. అక్రమ మార్గంలో ఈ దందా చేయడంతో వారంతా అనేక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోంది. రీచ్‌ల వల్ల వారికి అవి తొలుగుతాయి.
● ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన ఇసుక లభ్యమయ్యే అవకాశం ఉంది.
కేవలం ఐదు చోట్లనే రీచ్‌లు ఏర్పాటు
మిగతా మండలాల్లో దొరకక ఇబ్బందులు
అందుబాటులో ఉండేలా చర్యలు
జిల్లా అంతటా ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని చోట్ల రీచ్‌లు ప్రారంభమయ్యాయి. మరికొన్ని చోట్ల కూడా వీటిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అక్రమంగా ఇసుకను తరలించడం మానుకోవాలి. పట్టుబడితే రూ.25వేల జరిమానా విధిస్తాం. – జైసింగ్, జిల్లా మైనింగ్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment