● రేషన్ కార్డు కోసం పేర్లు డిలీట్ చేసుకున్న కొత్త జంట
ఈ యువకుడు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన బూస రాకేశ్. వివాహం అనంతరం తన భార్యతో కలిసి కొత్త రేషన్‌కార్డు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. వెంటనే అధికారులు పాతకార్డులో పేరు తీసివేశారు. కొత్త రేషన్ కార్డు జారీచేయలేదు. దీంతో పాత కార్డులో పేరు ఉండక, కొత్త రేషన్ కార్డు ఎప్పుడు వస్తోందో తెలియక ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నాడు.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వం అందించే ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్‌కార్డును ప్రామాణికం చేయడంతో కొత్తకార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వకాలం నుంచి కొత్త కార్డులు అందించకపోగా చేర్పులు, మార్పులకు నోచుకోని పరిస్థితి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి హామీ ఇచ్చినా.. జారీ విషయంలో ప్రకటనలే తప్ప సరైన స్పష్టత ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా పెళ్లయినవారు ప్రభుత్వ పథకాలు పొందడానికి ఉమ్మడి కుటుంబంలో ఉన్న రేషన్‌కార్డు నుంచి చాలామంది పేర్లు రద్దు చేసుకుని కొత్తకార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సైతం రేషన్‌కార్డు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో దరఖాస్తుదారుల పరిస్థితి కొండ నాలుకకు మందు వేసుకుంటే ఉన్న నాలుక ఊడిపోయిన చందంలా మారినట్లయింది.
కొత్త కార్డులోస్తాయని ఆశతో...
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంతో మంది కొత్తగా వి వాహం అయినవారు రేషన్‌కార్డు పొందేందుకు, త మ తల్లిదండ్రులతో ఉన్న తమ పేర్లను తొలగించుకున్నారు. కొత్తరేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తవి రాకపోగా, ఉన్న పాత రేషన్‌కార్డులో పేరు డిలీట్ కావడంతో ప్రభుత్వం అందించే సీ ఎంఆర్‌ఎఫ్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, తదితర ఆరు గ్యారంటీలతో పాటు తాజాగా ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్‌యువ వికాసం పథకం సైతం పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9,78,620 రేషన్‌కార్డులుండగా, కొత్త కార్డుల కోసం సుమారు 50వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా.. రేషన్ కార్డులు ఉన్న పేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నా లేని పేదల సంగతేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొత్త రేషన్ కార్డులు జారీ చేసే విషయం ఎలా ఉన్నా.. కనీసం ఆ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు కూడా అవకాశం లేకపోవడంతో పేదలు నష్టపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment