కాటారం: అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎలాంటి హాని కల్గకుండా చూసుకోవాలని కాటారం రేంజర్ స్వాతి, డిప్యూటి రేంజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. కాటారం మండలం చింతకానిలో బుధవారం గ్రామస్తులకు అడవుల సంరక్షణ, అగ్ని ప్రమాదాల నివారణ, పులి కదలికలపై అటవీశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అటవీ చట్టాలు, వన్య ప్రాణాలను వధిస్తే వర్తించే చట్టాలను వివరించారు. అడవులు విస్తారంగా ఉంటేనే సమయానికి వర్షాలు కురుస్తాయని పర్యావరణం అనుకూలంగా ఉంటుందన్నారు. వేసవి కాలంలో అడవుల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అడవుల్లో మంటలు అంటిస్తే కఠిన చర్యలు తప్పవని, మంటలు వ్యాపించడం గమనిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అడవుల్లో వంటలు చేయడం, పొగతాగడం లాంటివి చేయొద్దని సూచించారు. ఉచ్చులు, కరెంట్ తీగలు లాంటివి అమర్చి వన్యప్రాణులను వధిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు. అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రిపూట అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని సూచించారు. కార్యక్రమంలో యామన్‌పల్లి డీఆర్‌ఓ సురేందర్‌నాయక్, ఎఫ్‌బీఓ లు అశోక్, రాజేందర్, బేస్ క్యాంపు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.