తాగు, సాగునీటి సమస్య రానివ్వొద్దు
భూపాలపల్లి: వేసవిలో తాగు, సాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. తాగునీరు, సాగు నీరు, ఉపాధి హామీ పథకం అమలు, ఎల్‌ఆర్‌ఎస్, ఇంటి పన్నుల వసూలు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల మంజూరు తదితర అంశాలపై మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మండలస్థాయిలో అధికారులు సమావేశం ఏర్పాటుచేసి తాగునీటి సమస్యలపై నివేదికలు అందించాలన్నారు. గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాను అందించాలని, ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే అధికారులు ముందుగానే ప్రజలకు తెలియజేయాలన్నారు. సాగునీరు సమస్య తలెత్తకుండా చూడాలని క్షేత్రస్థాయిలో పరిశీలించి కాలువలు, చెరువుల నుంచి సాగవుతున్న పంటలకు నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు సరైన పనిదినాలు కల్పించాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 91శాతం ఇంటి పన్నులు వసూలు చేశారని, మిగిలిన 9 శాతాన్ని ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, డీపీఓ నారాయణరావు, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ప్రణాళికలు రూపొందించాలి..
జిల్లాలో సమగ్ర ప్రణాళిక అమలుకు సంబంధించి ‘సబ్‌కి యోజన–సబ్‌కి వికాస్’ కింద జిల్లా, మండల ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో ‘సబ్‌కి యోజన–సబ్‌కి వికాస్’ కింద జిల్లా, మండల ప్రణాళికలు రూపకల్పనపై జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమర్థవంతమైన అభివృద్ధి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ