ఆదిశిలా క్షేత్రంలో ప్రముఖుల పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం దేవాదాయ శాఖ అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ తులసి, ఈఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజనారెడ్డి దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, అర్చకులు వారికి సాదర స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ సెక్షన్ అధికారులు మాధవి, సుదర్శన్‌రెడ్డి, అలంపూర్ ఆలయ ఈఓ పురందర్, అర్చకులు మధుసూదనాచారి, రవిచారి, దీరేంద్రదాసు, శశాంక్, చంద్రశేఖర్ రావు, బాబురావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పాలకుల నిర్లక్ష్యంతోనే నత్తనడకన పనులు
సాక్షి, నాగర్‌కర్నూల్/ అచ్చంపేట: గత పాలకులు ఎస్‌ఎల్‌బీసీకి సరిపడా నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడంతోనే టన్నెల్ పనులు నిర్దేశిత సమయంలో పూర్తి చేయలేకపోయారని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే (సీపీఐఎం) జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఇద్దరు ఇంజినీర్లతోపాటు ఇద్దరు మిషన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఇరుక్కపోవడం దురదృష్టకరమన్నారు. ఆదివారం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పరిశీలించిన ఆయన అక్కడే ఉన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి.. సొరంగంలో ఇరుక్కుపోయిన వారిని రక్షించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గ్రావిటీ ద్వారా నీరందించడానికి తలపెట్టిన టన్నెల్ పనులను సకాలంలో పూర్తిచేయకపోవడంతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. సుమారు రూ.2 వేల కోట్లతో చేపట్టిన పనులను నాలుగేళ్లలో పూర్తిచేయాల్సి ఉండగా.. 20 ఏళ్లు అయినా పూర్తి చేయలేదన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీకి ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో పదేళ్లపాటు పనులు నిలిచిపోయాయని విమర్శించారు. ఫలితంగా వ్యయం పెరిగి.. అంచనా బడ్జెట్ రూ.4,600 కోట్లకు చేరిందని దుయ్యబట్టారు. టన్నెల్‌లో ఇరుక్కపోయిన వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి అన్నివిధాలా ఆదుకోవాలని, ఈ ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌కు పనిచేయలేదనే ఆధారాలు చూపిస్తావా?
వనపర్తిటౌన్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ గెలుపునకు పనిచేయలేదని ఎమ్మెల్యే మేఘారెడ్డి పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆధారాలుంటే బయట పెట్టాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం రాత్రి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన్నె జీవన్‌రెడ్డితో రూ.90 కోట్లు ఖర్చు చేయించి ఆ డబ్బుతో వనపర్తి పుర పీఠం దక్కించుకొని గొప్పపని చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. అసంపూర్తి పనుల విషయమై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డితో మాట్లాడానని.. నియోజకవర్గ అభివృద్ధికి ఎవరి కాళ్లు మొక్కేందుకై నా తాను వెనుకాడనని స్పష్టం చేశారు. అభివృద్ధి ముసుగులో అవినీతి జరగొద్దని.. ఓ వ్యక్తి కోసం మండల కేంద్రం కాకుండా వేరే ప్రాంతంలో శంకుస్థాపన చేస్తున్నందుకే అడ్డుకున్నట్లు చెప్పారు. 46 ఏళ్ల రాజకీయ జీవితంలో కన్నతల్లిలాంటి పార్టీకి ఏనాడు తప్పు, చెడు చేయలేదని.. మేఘారెడ్డి నాలుగేళ్లయితే మరో పార్టీలోకి వెళ్లరనే నమ్మకం ఏమిటని ప్రశ్నించారు. దేశస్థాయిలో తనకు నిజాయితీపరుడనే పేరుందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనను తెలంగాణ ఏకే అంటోనీగా పిలుస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల అధికారిక వాహనంలో రాకుండా సాధారణ కారులో ఎమ్మెల్యే ఎందుకు తీసుకొచ్చారో, మంత్రి ఎలా వచ్చారో అర్థం కాలేదన్నారు. విద్యార్థి దశ నుంచి ఏఐసీసీ స్థాయికి వరకు ఎదిగిన మేం టిష్యూ పేపర్‌లా కనబడుతున్నామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత, కొత్త 80, 20 శాతంలో ఉంటేనే పార్టీ బలపడుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆదిశిలా క్షేత్రంలో ప్రముఖుల పూజలు
Comments
Please login to add a commentAdd a comment