గద్వాల వ్యవసాయం: జిల్లాలోని జలాశయాలు, వాతావరణ పరిస్థితులు రొయ్యల సాగుకు అనుకూలంగా ఉండడంతో ఏటా రొయ్యల ఉత్పత్తి, సాగు ఆశాజనకంగా ఉండేది. ఇక్కడి మత్స్యకారులు సైతం మెరుగైన ఉపాధి పొందేవారు. కానీ, ఈ ఏడాది వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జలాశయాల్లో రొయ్యల సీడ్‌ను వదలలేదు. రొయ్యల సీడ్‌కు అవసరమయ్యే బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించలేదు. ఫలితంగా ఈసారి జిల్లాలో రొయ్యల సాగు లేకుండా పోయింది. రొయ్యల విక్రయాలతో ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్న మత్స్యకారులను ఆర్థికంగా దెబ్బ కొట్టినట్లయ్యింది.
పైలెట్ ప్రాజెక్ట్‌గా..
చాలా ఏళ్ల నుంచి మత్స్యశాఖ చేపల పెంపకంపై మాత్రమే దృష్టి పెడుతూ వస్తోంది. ఇందులో భాగంగా నీటి వనరుల్లో చేపల సీడ్‌ను వదిలేవారు. ఈ చేపలను మాత్రమే మత్స్యకారులు మార్కెట్‌లో విక్రయించేవారు. అయితే మార్కెట్‌లో రొయ్యలకు డిమాండ్ వచ్చింది. ఈక్రమంలో రొయ్యల పెంపకంపై ఆరేళ్ల క్రితం మత్స్యశాఖ దృష్టి సారించింది. ఇక్కడి వాతావరణం, జలాశయాల్లోని నీటి సాంద్రత, అందులో ఉండే లవణాలు తదితర అంశాలపై కొంత సమాచారం తీసుకున్నారు. ఖచ్చితంగా రొయ్యల ఉత్పత్తి బాగా జరుగుతుందని నిర్ధారించుకున్నారు. అనంతరం పైలెట్ ప్రాజెక్ట్‌గా 2019–20లో జూరాల జలాశయంలో 6 లక్షల రొయ్యల సీడ్‌ను వదిలింది. అధికారులు, మత్స్యకారులు భావించినట్లుగానే రొయ్యల ఉత్పత్తి బాగా జరిగింది. దీనికి ప్రధాన కారణం రొయ్య బాగా పెరగడానికి జలాశయ అడుగుబాగంలో ఇసుక నేలలు ఉండటంతో పాటు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దీంతో రొయ్యలు బాగా పెరిగాయి. అలా.. మత్యశాఖ అధికారులు ఏటా రొయ్యల సీడ్‌ను వదిలే సంఖ్యను పెంచుతూ వచ్చారు. 2020–21 లలో రెండు రిజర్వాయర్లలో, 2021–22లో మూడు, 2022–23లో ఐదు, 23–24లో ఆరు రిజర్వాయర్లలో నవంబర్, డిసెంబర్ నెలల్లో వదిలారు. ఇలా ఐదేళ్లు రొయ్యలను వదిలారు. చేతికి వచ్చిన రొయ్యలను ఆయా రిజర్వాయర్ల సహకార సంఘాల పరిధిలోని మత్స్యకారులు పట్టుకొని విక్రయించి ఆర్థికంగా ప్రయోజనం పొందారు.
2024–25 బడ్జెట్ కెటాయింపు ఏది?
రొయ్యలసాగు, ఉత్పత్తిలో భాగంగా రొయ్య సీడ్ కోసం ప్రభుత్వం రాష్ట్ర మత్స్యశాఖకు బడ్జెట్ కేటాయిస్తుంది. కేటాయించిన ఈ బడ్జెట్‌తో రొయ్యల సీడ్‌కు సంబంధించి మత్స్యశాఖ రాష్ట్ర స్థాయిలో టెండర్లు ఆహ్వానిస్తుంది. టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్ ఆయా జిల్లాలకు నిర్ధేశించిన సీడ్ సంఖ్య ప్రకారం పంపిణీ చేస్తాడు. ఒక రొయ్య సీడ్ రూ.2 నుంచి రూ. 2.50పైసల వరకు గడిచిన ఏడాది వరకు ఉండింది. అయితే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రొయ్యల సీడ్‌కు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేదు. దీనివల్ల టెండర్ల ప్రక్రియ ముందుకు సాగలేదు. ఆయా జిల్లాలకు రొయ్య సీడ్ సప్లై కాలేదు.
ఏడాది వదిలిన రొయ్యల సీడ్ సంఖ్య
2019–20 6,00,000
2020–21 9,00,000
2021–22 22,00,000
2022–23 23,00,000
2023–24 32,00,000
2024–25 బడ్జెట్ కేటాయింపు
జరగలేదు
జిల్లాలో నీటి వనరులు..
జిల్లాలో 92 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా.. 8102 మంది మత్స్యకారులు ఉన్నారు. ఈ కుటుంబాలకు చేపల పెంపకం, విక్రయించడమే జీవనాధారం. జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు, జూరాల ప్రాజెక్టుతో పాటు ఏడు రిజర్వాయర్లు, 38 నోటిఫైడ్ చెరువులు, చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో ఏటా మత్స్యశాఖ అందించే చేపల, రొయ్యల సీడ్‌ను వదిలి పెంచుతున్నారు.
మత్స్యకారుల ఉపాధిపై దెబ్బ
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో భాగంగా మాంసప్రియులు ఎక్కువగా చేపలు తింటున్నారు. మార్కెట్‌లో చేపల రకాన్ని బట్టి వీటికి డిమాండ్, ధరలు ఉంటాయి. అయితే రొయ్యలు బోన్‌లెస్‌గా ఉంటాయి. దీంతో వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. గద్వాల ప్రాంతంలో కేజీ రూ.200 నుంచి రూ.300 వరకు ధరలున్నాయి. అయితే రొయ్యల సీడ్ వదిలిన ఆరు, ఏడు నెలల తర్వాత ఆ రిజర్వాయర్ పరిధిలోని మత్స్యపారిశ్రామిక సంఘాల్లోని మత్స్యకారాలు వలల ద్వారా రొయ్యలు పట్టుకొని విక్రయిస్తారు. వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తారు. కాగా ఈఏడాది జలాశయాల్లోకి రొయ్య సీడ్‌ను వదలకపోవడం వల్ల మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోనున్నారు. గడిచిన ఐదేళ్ల రొయ్యల ఉత్పత్తిని బట్టి ఈఏడాది 286 టన్నుల రొయ్యల ఉత్పత్తి జరగాలి.
Comments
Please login to add a commentAdd a comment