అధికారుల దృష్టికి తీసుకెళ్తాం..
జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో టీ–ఫైబర్ సేవలకు సంబంధించిన పరికరాలను బిగించి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలకు డిజిటల్ సేవలు అందడం లేదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. డిజిటల్ సేవలు అందుబాటులోకి వస్తే పనులు సులభతరమవుతాయి. – నాగేంద్రం, డీపీఓ
గ్రామపంచాయతీల్లో
నిరుపయోగంగా పరికరాలు
● ఇంటర్నెట్ సౌకర్యంలేక
మరుగున పడిన ఈ–పాలన
● ఏ పనికై నా
మండల కేంద్రానికి వెళ్లాల్సిందే..
●
మానవపాడు: ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ సేవలు ఎంత అవసరమో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలతో పాటు ప్రతీ పనికి సాంకేతికతతో ముడిపడి ఉంది. ఈ నైపథ్యంలో ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ–పాలన, ఇంటింటికీ తక్కువ ధరకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2017లో టీ–ఫైబర్ సేవలకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల, కళాశాలలు, ఆస్పత్రులు, బ్యాంకులు, రైతువేదికలు, ఇతర ప్రజాసేవల సంస్థలకు అతివేగంతో కూడిన ఇంటర్నెట్ సౌకర్యం అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా మిషన్ భగీరథ పథకం పైప్‌లైన్లు నిర్మించే సమయంలో టీ–ఫైబర్ కేబుల్ వేశారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లోనూ టీ–ఫైబర్ పరికరాలు అమర్చారు. అయితే ఇప్పటి వరకు సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు.
ఎన్నికలలోపు అందుబాటులోకి వచ్చేనా?
ప్రస్తుతం గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, నామినేషన్లు, ఎన్నికల నిర్వహణ, విజేతల వివరాలు ఇలా ప్రక్రియ అంతా ఇంటర్నెట్ ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేక మండల పరిషత్ కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే, పంచాయతీల్లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించక ముందే విద్యుత్ సౌకర్యం కోసం మీటర్లు బిగించారు. దీంతో రూ. వేలల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. సేవల మాటేమో గాని బిల్లుల మోత మాత్రం తప్పడం లేదు.
జాడలేని ఈ–పాలన..
జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో 255 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, నిధుల కేటాయింపు, ఆదాయ వ్యయాలు, కార్మికుల జీత భత్యాల చెల్లింపులతో పాటు జనన, మరణ ధ్రువపత్రాల జారీ, ఇంటిపన్ను తదితర సేవలను గ్రామపంచాయతీల పరిధిలోని ప్రజలకు డిజిటల్ రూపంలో అందించాలన్నది ప్రధాన ఉద్దేశం. అందుకోసం క్లస్టర్ల వారీగా ప్రత్యేకంగా కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. విద్యుత్ సౌకర్యం కోసం సోలార్ ప్లేట్లు, ఇన్వర్టర్ బ్యాటరీలు అమర్చారు. సాంకేతిక సిబ్బంది పంచాయతీలకు వచ్చి టెస్టింగ్ కూడా చేశారు. కంప్యూటర్లు, ప్రింటర్లు అందించారు. అయితే పంచాయతీల్లో ఆన్‌లైన్ సౌకర్యం అందుబాటులోకి రాకపోవడంతో ఈ–పాలన మరుగున పడింది. ప్రస్తుతం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో టీ–ఫైబర్ పరికరాలు నిరుపయోగంగా మారాయి. పంచాయతీ పాలనలో పారదర్శకత, జవాబుదారీ తనంతో పాటు ప్రజలకు డిజిటల్ సేవలు అందించాలనే సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు. గ్రామపంచాయతీల పరిధిలో ప్రభుత్వ పథకాల అమలులో ఏమైనా అవాంతరాలు ఉంటే లబ్ధిదారులు మండల పరిషత్ కార్యలయాలకు వచ్చి వాకబు చేయాల్సి వస్తోంది. పన్నులు, ఇతర రుసుములు చెల్లిస్తున్న వారికి పంచాయతీ కార్యదర్శులు చేతిరాత రశీదులే ఇస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం టీ–ఫైబర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి ఈ–పాలన అందించాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు.