మానవపాడు: జాతీయ ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు అన్నారు. శుక్రవారం మండలంలోని ఎ.బుర్ధిపాడు, కలుకుంట్ల, మానవపాడులో చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి గ్రామ పంచాయతీలో 50 మందికి పైగా కూలీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో జాబ్‌కార్డు ఉన్నవారందరికీ అవగాహన కల్పించాలని ఫీల్డ్‌అసిస్టెంట్లను ఆదేశించారు. క్లస్టర్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామానికి ఉపయోగపడే పనులు చేపట్టాలని, గ్రామపరిదిలోని చిన్నపాటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేసుకోవాలని పేర్కొన్నారు. వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించాలన్నారు. అనంతరం నర్సరీలను పరిశీలించి అనుకున్న లక్ష్యాలను చేరుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇదిలాఉండగా, ఉపాధిహామీ కూలి రూ.300కు పెంచాలని కలుకుంట్ల కూలీలు అడిషనల్ కలెక్టర్‌ను కోరారు.