కేటీదొడ్డి: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గంట కవితాదేవి అన్నారు. శనివారం మండలంలోని పాతపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, వార్షిక పరీక్షలలో ప్రైవేటుకు దీటుగా ఫలితాలు అనేది ఎంతో కీలకమైనదని, ఎక్కడికి వెళ్లినా మొదట ఎస్సెస్సీ మెమోనే చూస్తారని చెప్పారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను శ్రద్ధగా వినడం, చదవడం, రాయడం, చేస్తారో వారే మంచి మార్కులు సాధిస్తారన్నారు. క్రమశిక్షణతో చదువుకున్న వారు పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులకు బాల కార్మికుల చట్టాలు, బాల్య వివాహాలు, చైల్డ్ అబ్యూస్ వంటి చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం వెంకటేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని పాగుంట శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామిని ఆమె దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.