గద్వాల క్రైం: క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందిగా జిల్లా ఇన్‌చార్జ్ వైద్యాధికారి సిద్దప్ప అన్నారు. సోమవారం క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో హాజరై మాట్లాడారు. క్షయ వ్యాధి ప్రాణాంతకమైన వ్యాధి కాదని, నివారణ దిశగా వైద్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించి అనుమానిత కేసుల విషయంలో రోగులకు పరీక్షలు నిర్వహించి అవసరమైయ్యే మందులను ఉచితంగా అందించామన్నారు. జ్వరం, దగ్గు ఉన్న వారి గళ్ల పరీక్షలు నిర్వహించి వారిని గుర్తించేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారని, మంచి ఆహారపు అలవాట్లు తప్పనిసరిగా పాటించాలన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం లక్షణాలు కలిగిన వారు దగ్గర్లోని పీహెచ్‌సీలలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, క్షయ వ్యాధి నివారణ కోసం వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తల సేవలు ఎంతో అభినందనీయమన్నారు.అంతకు ముందు జిల్లా కేంద్రంలోని క్రిష్ణవేణి చౌక్ నుంచి పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు.