కొత్తపేట, రాజమహేంద్రవరం రూరల్, సిటీల్లో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
అనంతరం కాకినాడ పయనం
వెల్లడించిన మంత్రి వేణు, ఎంపీ భరత్‌రామ్, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
రాజమహేంద్రవరం సిటీ/కొత్తపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరగనుంది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సీఎం జగన్ బస్సు యాత్ర మంగళవారం రాత్రికి రావులపాలెం మండలం ఈతకోట చేరుకుని, అక్కడ రాత్రి బస చేయాల్సి ఉంది. బుధవారం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా బస్సు యాత్రకు విరామం ఇచ్చారు. ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుని, గురువారం బస్సు యాత్ర కొనసాగించాలని తొలుత నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే బస్సు యాత్ర షెడ్యూల్‌లో మార్పు చేయడంతో సీఎం జగన్ మంగళవారం రాత్రి తణుకు సమీపంలోని తేతలిలో బస చేస్తారు. అనంతరం గురువారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వస్తారు. ఈ వివరాలను కొత్తపేట ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెంలో తెలిపారు.
బస్సు యాత్ర షెడ్యూల్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి, వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్‌రామ్‌లు రాజమహేంద్రవరంలోని ఎంపీ కార్యాలయంలో మంగళవారం సంయుక్తంగా విలేకర్ల సమావేశంలో వివరించారు. ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించే ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ సిద్ధం చేసిన రూట్ మ్యాప్ ప్రకారం.. సీఎం జగన్ కాన్వాయ్ రావులపాలెం, కడియం మీదుగా గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు వేమగిరి చేరుతుందని తెలిపారు. అక్కడ భోజనం విరామం అనంతరం, పార్టీ ముఖ్య నేతలతో జగన్ కొద్దిసేపు మాట్లాడతారు.
అనంతరం 3.30 గంటల నుంచి రోడ్డు షో కొనసాగుతుంది. వేమగిరి మీదుగా బొమ్మూరు జంక్షన్, హుకుంపేట జంక్షన్, మోరంపూడి జంక్షన్, ఎంపీ కార్యాలయం, ఆర్టీసీ కాంప్లెక్స్, తాడితోట జంక్షన్, అశోకా థియేటర్, ఆజాద్ చౌక్, గాంధీ బొమ్మ సెంటర్, దేవీచౌక్, గోకవరం బస్టాండ్, ఆర్యాపురం, అకీరా జంక్షన్, మూలగొయ్యి, సీతంపేట, పేపర్ మిల్లు, మల్లయ్యపేట, గామన్ బ్రిడ్జి మీదుగా దివాన్ చెరువు వరకూ రోడ్ షో సాగుతుంది. అక్కడి నుంచి సీఎం జగన్ కాకినాడ వెళ్తారు. రాజమహేంద్రవరం నగర పరిధిలో మధ్యాహ్నం 4 నుంచి 7 గంటల వరకూ సుమారు మూడు గంటల పాటు రోడ్డు షో కొనసాగుతుంది.
ప్రజల అభిమానం, ప్రార్థనలతో రాయి దాడి నుంచి సీఎం జగన్ త్వరగా కోలుకున్నారని, జిల్లాకు రానున్న ఆయనకు అఖండ స్వాగతం పలకాలని, అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి, బస్సు యాత్రను విజయవంతం చేయాలని మంత్రి వేణు, ఎంపీ భరత్‌రామ్ ప్రజలకు పిలుపునిచ్చారు. గోదావరి తీరంలో జగన్ రోడ్డు షోకు వచ్చిన ప్రజలను చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలని అన్నారు. విలేకర్ల సమావేశంలో రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, పార్టీ అబ్జర్వర్ రావిపాటి రామచంద్రరావు, నందెపు శ్రీనివాస్, వాసంశెట్టి గంగాధర్, కడియాల శ్రీను, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment