గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై కుక్క దాడి
గోకవరం: వీరలంకపల్లి గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో బుధవారం దారుణం జరిగింది. పాఠశాల ఆవరణలో ఓ విద్యార్థినిపై వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న పైడిమళ్ల ఉమామహేశ్వరి సాయంత్రం ఐదు గంటల సమయంలో మరుగుదొడ్డికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. విద్యార్థినికి మెడ వెనుక, చేతిపై తీవ్రంగా గాయలు కావడంతో ప్రిన్సిపాల్ మంజులా రాణి, ఇతర సిబ్బంది వెంటనే గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించి పర్యవేక్షణలో ఉంచారు. దీనిపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా పాఠశాలలో డ్రైనేజీ నీరు వెళ్లే వైపు ఉన్న రంధ్రం నుంచి కుక్కలు చొరబడ్డాయన్నారు. వాటిని తరుముతున్నా తిరిగి లోపలకు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉందని, 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని వైద్య సిబ్బంది సూచించారన్నారు. విద్యార్థిని తల్లి పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment