మళ్లీ సంపద సృష్టి!
ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి
భూముల విలువ పెంపు ప్రతిపాదనలు రూపొందించాం. మున్సిపల్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, కౌడా తదితర శాఖల సమన్వయంతో ఈ ప్రతిపాదనలను సబ్ రిజిస్ట్రార్ స్థాయిలో తయారు చేశారు. ఇక్కడ తయారు చేసిందేమీ ఫైనల్ కాదు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి రూపొందించిన ప్రతిపాదనలను గురువారం నాటికి జిల్లా జాయింట్ కలెక్టర్‌కు నివేదించనున్నాం. జాయింట్ కలెక్టర్ స్థాయిలో కమిటీ పరిశీలన జరిపి తుది నిర్ణయం తీసుకోనుంది.
– కె.ఆనందరావు, జిల్లా రిజిస్ట్రార్, కాకినాడ
సామాన్యులపై
భారం పడకుండా చూడాలి
వాణిజ్య ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాల విలువ పెంచేటప్పుడు స్థానికంగా నివాసం ఉండే సామాన్యులపై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వాస్తవ పరిస్థితులను గుర్తించి తుది నిర్ణయం తీసుకోవాలి. లేదంటే వాణిజ్య సముదాయాలు నిర్వహించే వారికి పడే పన్నుల భారమే సామాన్య నివేశన స్థలాలు ఉన్న వారికి కూడా పడుతుంది. ఈ విషయంలో అధికారులు స్పందించకుంటే ప్రజల తరఫున పోరాటానికి సిద్ధం అవుతాం.
– తాటిపాక మధు,
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, కాకినాడ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సీఎం చంద్రబాబు మార్కు సంపద సృష్టికి రంగం సిద్ధమైంది. ఈసారి భూముల ధరలకు రెక్కలు వచ్చేస్తున్నాయి. ప్రజల నెత్తిన కూటమి ప్రభుత్వం పిడుగులు కురిపేంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. నిన్న మొన్నటి వరకు విద్యుత్ చార్జీలు ఎడాపెడా పెంచేసి అన్ని వర్గాలపై ఆర్థిక భారాన్ని మోపింది. ఆ బిల్లులు కట్టలేం మొర్రో అనుకుంటుండగా సర్కార్ ఇప్పుడు భూముల విలువను పెంచేసి మరో ధరల భారాన్ని నెత్తిన పెడుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి భూమి విలువలు పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో వినియోగదారులపై అదనపు భారం మోపేందుకు సిద్ధమవుతోంది. – అసలే రియల్ ఎస్టేట్ సంక్షోభంలో ఉన్న తరుణంలో ఇలా భూమి విలువ పెంచడం వల్ల ప్లాట్‌లు కొనే నాథుడే ఉండడని ఆ రంగంపై ఆధారపడినవారు ఆందోళన చెందుతున్నారు. విలువ పెంపు ప్రక్రియపై కసరత్తు దాదాపు పూర్తి అయింది. ఆయా సబ్ రిజిస్ట్రార్‌లు, ఎంపీడీఓలు, తహసిల్దార్‌లు, మున్సిపల్ కమిషనర్‌లు, కౌడా అధికారులు కలిసి తయారు చేసిన ఈ పెంపు ప్రతిపాదనలు గురువారం జాయింట్ కలెక్టర్ స్థాయిలో పరిశీలనకు వెళ్లనున్నాయి.
● కార్పొరేషన్లలో నివేశన స్థలాలకు 10 నుంచి 30 శాతం
● కార్పొరేషన్లలో వాణిజ్య స్థలాలకు 50 నుంచి 150 శాతం
● మున్సిపాలిటీల్లో నివేశన స్థలాలకు 10 నుంచి 30 శాతం
● పంచాయతీల్లో రియల్ ఎస్టేట్ ప్రాంతాల్లో 30 నుంచి 100 శాతం
● పంచాయతీల్లో నివేశన స్థలాలకు 5 నుంచి 20 శాతం
● వ్యవసాయ భూములకు 10 నుంచి 30 శాతం
ఇలా ప్రజలపై పెను భారం మోపేందుకు కూటమి సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. కాకినాడ జిల్లాలో ఒక జిల్లా రిజిస్ట్రార్, 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటి ద్వారా చిన్నా పెద్దా కలిపి రోజూ 500 రిజిస్ట్రేషన్‌లతో రూ.కోటి నుంచి రూ.1.50 కోట్ల రిజిస్టేషన్ ఫీజు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కాకినాడ నగరపాలక సంస్థ సహా తుని, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి.
జిల్లాలో భూముల విలువ పెంపుపై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, రిజిస్ట్రేషన్, కౌడా అధికారులు సమాలోచనలు చేసి ధరలు పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నివాస, వాణిజ్య, వ్యవసాయ, జాతీయ రహదారులు, ప్రధాన రహదారుల ప్రాంతాల్లో అమలులో ఉన్న మార్కెట్ విలువ 10 శాతం నుంచి 100 శాతం వరకు పెంచాలని ప్రతిపాదించారు. తుది నిర్ణయం జేసీ తీసుకుని ప్రభుత్వానికి నివేదిస్తారు.
వాణిజ్య ప్రాంతాల్లో..
కాకినాడ జవహర్‌వీధి, మార్కెట్ వీధి, దంటువారి వీధి, ఎస్‌బీఐ, సుభాష్ వీధి, మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఇటు, అటు వైపు ఉన్న వాణిజ్య వ్యాపారాలు జరుగుతున్న వీధుల్లో భూముల ధరలు ఆకాశాన్నంటే పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వీధులలో భూముల ధరలు ప్రభుత్వం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం గజం రూ.95 వేలు వరకు ఉంది. ప్రభుత్వం పెంచే విలువ ప్రకారం చూసుకుంటే ఈ ప్రాంతాల్లో గజం తక్కువలో తక్కువ రూ.1.20 లక్షలు కానుంది. అదే కాకినాడలో వ్యాపార కార్యకలాపాలు ఎక్కువగా జరిగే సినిమా రోడ్డులో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ప్రస్తుతం గజం రూ.34 వేలు ఉంది. ఈ ప్రాంతంలో జనవరి ఒకటో తేదీ నుంచి గజం స్థలం సుమారు రూ.1.20 లక్షలు కానుంది. అంటే ఈ ప్రాంతాల్లో గజం ఇప్పుడున్న ధరలతో పోలిస్తే 150 శాతం వరకు పెరిగిపోనుంది. కాకినాడలో మరో వాణిజ్య కార్యకలాపాల కేంద్ర బిందువు మెయిన్‌రోడ్డు. ఈ రోడ్డులో మసీదు సెంటర్ నుంచి జగన్నాథపురం వరకు ఇరువైపులా వాణిజ్య కార్యకలాపాలు జరుగుతాయి. ఈ ప్రాంతంలో ప్రస్తుతం గజం రూ.60వేలు ఉంది. వచ్చే జనవరి నుంచి ప్రభుత్వం పెంచే ధరల్లో చూసుకుంటే గజం రూ.1.20 లక్షలు అవుతుంది. వాణిజ్య కార్యకలాపాలకు పెట్టింది పేరు దేవాలయం వీధి. ఇటీవల కాలంలో ఈ వీధిలో దేశ, అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ కలిగిన బంగారు దుకాణాలు ఒకటి వెనుక ఒకటి వచ్చేశాయి. ఒకప్పుడు దేవాలయం వీధిగా పిలిచే ఈ వీధి ఇప్పుడు గోల్డ్ స్ట్రీట్‌గా మారిపోయింది. శివాలయం నుంచి మొదలై బాలాజీచెరువు టీడీడీ కల్యాణ మండపం వరకు ఉన్న ఈ వీధిలో డజనుకు పైగా బంగారు దుకాణాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ గజం రూ.36 వేల నుంచి రూ.42 వేలు ఉంది. ఇక్కడ జరుగుతోన్న వ్యాపార లావాదేవీలను పరిగణనలోకి తీసుకుని మూడు రేట్లు అంటే గజం సుమారు రూ.120 లక్షలకు పెంచేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఇక్కడున్న బంగారం దుకాణాలను లెక్కలేసి ధరలు మూడు రెట్లు పెంచేసి ఇవే ధరలను ఇక్కడ నివసించే సామాన్యులు, మధ్యతరగతి ఇతర వర్గాలపై భారం మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇలా అడ్డగోలుగా భారం మోపాలనుకోవడం ఎంతవరకు సమంజసమని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు.
నివాసాలను వదిలి పెట్టేలా లేదు...
కమర్షియల్ ప్రాంతాల్లోని స్థలాలే కాకుండా నివేశన స్థలాలపై కూడా భారం మోపేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కాకినాడ జిల్లాలో నివాస ప్రాంతాల్లో గజం 10 శాతం నుంచి 30 శాతం వరకు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఉదాహరణకు కాకినాడ ఏటిమొగ ప్రాంతంలో ఇప్పుడు గజం రూ.7 వేలు ఉంటే ఇది జనవరి నుంచి రూ.10 వేలు వరకు పెరుగుతుంది. తిలక్‌వీధి, సూర్యనారాయణపురం, గాంధీనగర్, రామారావుపేట, అచ్యుతాపురం, నూకాలమ్మ టెంపుల్ తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం గజం రూ.23 వేలు ఉంది. కూటమి సర్కార్ జనవరి నుంచి గజం ఈ ప్రాంతాల్లో రూ.30 వేల వరకు పెంచుతోంది.
నిర్మాణాల విలువ పెంపు
ఆర్‌సీసీ భవనాలు, మట్టి మిద్దెలు, రేకుల షెడ్లు, సెల్లార్, సినిమా హాళ్లు, పరిశ్రమలు, పూరిళ్లు తదితర నిర్మాణాల (కట్టిన) విలువలను కూడా పెంచేందుకే నిర్ణయించారు. ప్రస్తుతం వీటి మార్కెట్ విలువను ప్రస్తుతం చదరపు అడుగుకు 10 శాతం నుంచి 20 శాతం వరకు పెంచుతున్నారు.
గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భూముల ధరలను పెద్దగా పెంచకుండా ఉదారంగా వ్యవహరించింది. రెండేళ్లు పాటు కోవిడ్ విలయంతో సతమతమైన ప్రజలపై భారం పడుతుందనే ఉద్ధేశంతో నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భూముల ధరలను స్వల్పంగా పెంచారు. అధికారం ఇస్తే సంపద సృష్టిస్తానని ఊరూవాడా చంద్రబాబు ప్రచారం చేశారు. సంపద సృష్టి అంటే ఇదేనా అని జనం ప్రశ్నిస్తున్నారు. వాణిజ్య ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాల విలువ పెంచేటప్పుడు సంబంధిత డోర్ నంబర్, విద్యుత్ బిల్లులు, మున్సిపాలిటీ విధించే దుకాణ పన్ను ఆధారం చేసుకోవాలంటున్నారు. లేదంటే ఆ ప్రాంతాల్లో ఉన్న నివేశన స్థలాలకు కూడా ఇదే భారం పడుతుందంటున్నారు. ఎవరైనా కుమార్తె, కుమారులకు తన ఆస్థి దానపట్టా లేదా పంపకాలు చేయాల్సి వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు తడిసి మోపెడవుతుందని మండిపడుతున్నారు.
ఈసారి భూమి ధరలకు
రానున్న రెక్కలు
ప్రజల నెత్తిన ‘కూటమి’ మరో పిడుగు
వాణిజ్య ప్రాంతాల్లో 50 నుంచి
150 శాతం పెంపునకు సిద్ధం
అసలే పడకేసిన రియల్ ఎస్టేట్ రంగం
ప్లాట్‌లు కొనే నాథుడే
ఉండడని ఆందోళన
నేడు ప్రతిపాదనల
ఫైల్ జాయింట్ కలెక్టర్‌కు
గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఇలా...
గ్రామం ప్రస్తుతం పెరిగాక ఇలా..
గజం (రూ.లలో)
మాధవపట్నం 6,900 10,000
పనసపాడు 7,000 10,000
తిమ్మాపురం 9,000 12,000
తమ్మమరం 6,000 8,000
వాలకపూడి/
వలసపాకల 9,000 12,000
Comments
Please login to add a commentAdd a comment