నీటిపారుదల ఆధునీకరణకు డీపీఆర్
కాకినాడ సిటీ: కొత్తగా ఎన్నికై న నీటి వినియోగదారుల సంఘాల సలహాలు, సూచనలతో ఏలేరు ఇరిగేషన్ వ్యవస్థ ఆధునీకరణకు రివైజ్డ్ డీపీఆర్ రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని జిల్లా సమీక్ష కమిటీ నిర్ణయించిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగునూరు నారాయణ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో కాకినాడ జిల్లా సమీక్షా కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో జిల్లా అభివృద్ధికి జరుగుతున్న కార్యక్రమాల ప్రగతి, చేపట్టవలసిన భవిష్యత్ ప్రణాళికలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ, వ్యవసాయం, పురపాలన, పట్టణాభివృద్ధి, మెప్మా, కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్, మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం, తాగునీటి సరఫరా, రోడ్లు, భవనాలు, ఇరిగేషన్ అంశాలపై ప్రజాప్రతినిధులు చర్చించారు.
ఉపాధి హామీలో 50 శాతం రైతులు, 50 శాతం ఉపాధి హామీ పథకం నిధులతో వ్యవసాయ పనులను ఉపాధి హామీ పథకం కింద చేపట్టేలా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని కమిటీ నిర్ణయించందని మంత్రి నారాయణ తెలిపారు. మున్సిపల్ పరిపాలన సమీక్షలో సాలిడ్ వేస్డ్ నియంత్రణకు ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరుల్లో విజయవంతమైన వేస్ట్–టు–ఎనర్జీ ప్లాంట్‌ను రాజానగరం, కాకినాడల మధ్య ఏర్పాటు ప్రతిపాదించి ఇందుకు అవసరమైన భూమిని గుర్తించాలని అధికారులకు కమిటీ సూచిందన్నారు. కాకినాడలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఉప్పుటేరుపై మూడవ బ్రిడ్జి, బైపాస్ రోడ్డు నిర్మించాలని కమిటీ నిర్ణయించినట్లు నారాయణ తెలిపారు. వచ్చే ఏప్రిల్ నుంచి మున్సిపల్ పన్నుల నిధుల సీఎస్‌ఎఫ్‌ఎం పరిధి నుంచి తప్పించి స్థానిక సంస్థల పరిధిలోనే ఖర్చు చేసుకునేలా మార్పు చేయనున్నట్లు మంత్రి వివరించారు. కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, బొర్రా గోపీమూర్తి, ఎమ్మెల్యేలు చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, యనమల దివ్య, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment