తునిలో టీడీపీ అరాచకం
● వైస్ చైర్మన్ పదవి కోసం బరితెగింపు
● రేప్ కేసులు పెడతామంటూ
కౌన్సిలర్లకు బెదిరింపులు
● మాజీ మంత్రి దాడిశెట్టి రాజా
మండిపాటు
తుని: మున్సిపల్ ఎన్నికల్లో తుని పట్టణ ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పి, ఒక్క సీటు కూడా ఇవ్వక పోయినా దొడ్డిదారిలో వైస్ చైర్మన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తుని మున్సిపల్ చైర్‌పర్సన్ నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజులుగా తునిలో టీడీపీ నాయకులు, పోలీసులు కలిసి అరాచకం సృష్టిస్తూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను భయాందోళనలకు గురి చేస్తున్నారని అన్నారు. కౌన్సిలర్లకు ఫోన్లు చేసి, రేప్ కేసులు పెడతామని హెచ్చరిస్తూంటే చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు పసుపు చొక్కాలు వేసుకుని వంత పాడుతున్నారని ధ్వజమెత్తారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 30కి 30 కౌన్సిలర్ పదవులనూ వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుందని గుర్తు చేశారు. రెండో వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఈ నెల 3, 4 తేదీల్లో కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తే టీడీపీ నాయకులు, గుండాలు, రౌడీషీటర్లు చొచ్చుకుని వచ్చి ఎన్నికను అడ్డుకున్నారని, విధి లేని పరిస్థితుల్లో కౌన్సిలర్లు హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. కౌన్సిలర్ల తరఫు న్యాయవాది సమర్పించిన వీడియోలను పరిశీలించి, ఈ నెల 17న తిరిగి ఎన్నిక నిర్వహించాల్సిందిగా డీజీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. వైస్ చైర్మన్ ఎన్నిక పక్రియ వీడియో తీయించి, కోర్టుకు సమర్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించిందని తెలిపారు.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇక గలాటా చేసి, వైస్ చైర్మన్ ఎన్నికను అడ్డుకోలేమని తెలుసుకున్న టీడీపీ నాయకులు.. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను బలవంతంగా చేర్చుకోవడానికి బెదిరింపులకు దిగారని రాజా అన్నారు. ఏకంగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు జోక్యం చేసుకుని బెదిరింపులకు పాల్పడటం సబబు కాదన్నారు. కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి, పార్టీ మారకపోతే కేసులు పెడతామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నిక ప్రశాంతంగా జరిపించాలని టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు చిలక పలుకులు పలకడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కోర్టు అక్షింతలు వేయడంతో కళ్లు తెరిచారన్నారు. 30 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఉంటే ఇందులో 10 మందిని బలవంతంగా చేర్చుకున్నంత మాత్రాన వైఎస్సార్ సీపీ విజయాన్ని అడ్డుకోలేరని రాజా స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు టీడీపీ తూట్లు పొడిచినా చివరకు న్యాయమే గెలుస్తుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment