
గుర్రాల జోరు.. కుర్రకారు హుషారు!
పిఠాపురం: రేసు గుర్రాల గిట్టల హోరుతో గొల్లప్రోలు మండలం చేబ్రోలు మారుమోగింది. ఉత్కంఠ మధ్య రెప్ప పాటులో గమ్యాన్ని చేరుకోడానికి గుర్రాలు దౌడు తీస్తుంటే రేగిన దుమ్ములో జనం కేరింతలు కొట్టారు. ఎప్పుడో పదేళ్ల క్రితం జిల్లాలో సామర్లకోటలో జరిగిన గుర్రప్పందేలు తరువాత మళ్లీ ఇప్పుడే జరగడంతో వాటిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. చేబ్రోలులో శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర స్థాయి గుర్రాల పరుగు పోటీ నిర్వహించారు. ఏటా ఈ పందేలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది కొత్తగా గుర్రప్పందేలు నిర్వహించారు. రాష్ట్రం నలు మూలల నుంచి సుమారు 35 గుర్రాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఈ పందాల్లో చేనుల అగ్రహారం మణికి చెందిన జెస్సీ గుర్రం ప్రధమ స్థానాన్ని కై వసం చేసుకుంది. రామన్నపాలేనికి చెందిన చోడమాంబిక గుర్రం విక్రమ్ రెండోస్థానాన్ని, అంకుపాలేనికి చెందిన మోదమాంబకు చెందిన గుర్రం మురుగన్ మూడోస్థానాన్ని కై వసం చేసుకుంది. ఆర్‌ఆర్ పేటకు చెందిన దాడి రాముడు గుర్రం భగి, సింగపూర్ సత్యనారాయణకు చెందిన గుర్రం దేవర, కోటనందూరుకు చెందిన శివరాజ్ బ్రదర్స్ గుర్రం రాఖీ, సామర్లకోటకు చెందిన జగదీష్ రాజా గుర్రం, శివరాజ్ బ్రదర్స్ గుర్రం చిన్ని, ఆర్‌ఆర్‌పేటకు చెందిన దాడి నూక హనుమంత్ గుర్రం కాళీ, చోడమాంబిక గుర్రం రాకెట్ వరుసగా నాలుగు నుంచి పది స్థానాల్లో నిలిచి బహుమతులు గెలుచుకున్నాయి. విజేతలకు ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు బహుమతులు అందజేశారు.
చేబ్రోలులో ఉత్సాహంగా గుర్రప్పందేలు
విజేతలకు బహుమతులు అందజేత