కాంగ్రెస్‌ టికెట్టు కోసం ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ టికెట్టు కోసం ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ

Published Sat, Sep 2 2023 1:36 AM | Last Updated on Sat, Sep 2 2023 2:06 PM

- - Sakshi

సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయింది. గతంలో జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంనుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన మదన్‌ మోహన్‌రావుతోపాటు మరోనేత వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి టికెట్లు ఆశిస్తున్నారు. ఇద్దరు నేతలు చాలాకాలంగా నియోజకవర్గంలో ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నిక ల్లో సుభాష్‌రెడ్డి టికెట్టు ఆశించగా.. జాజాల సురేందర్‌కు దక్కింది. మదన్‌మోహన్‌రావు 2019 ఎన్నికల్లో జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన జాజాల సురేందర్‌ పార్లమెంట్‌ ఎన్నికలకు ముందే గులాబీ కండువా కప్పుకున్నారు. సురేందర్‌ వెంట కొందరు కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటినుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జీగా సుభాష్‌రెడ్డి కొనసాగుతూ వస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే సురేందర్‌ కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌ లో చేరడంతో తనకు నష్టం జరిగిందని మదన్‌మోహన్‌రావు ఎమ్మెల్యే సురేందర్‌పై ఆగ్రహంతో ఉన్నారు. 2023 ఎన్నికల్లో సురేందర్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉన్న మదన్‌మోహన్‌రావు.. ఎల్లారెడ్డి నియోజకవర్గంపై దృష్టి సారించారు.

అప్పటినుంచి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపడుతూ, కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఎల్లారెడ్డి నుంచి పోటీ చేయాలని పట్టుదలతో ఉన్న సుభాష్‌రెడ్డి సైతం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇద్దరు నేతలు ఇటు పార్టీ కార్యక్రమాలతోపాటు అటు సేవా కార్యక్రమాలలో పోటీ పడుతున్నారు.

దీంతో నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఇరువురి అనుచరులు వేర్వేరుగా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఇద్దరూ ఎల్లారెడ్డి పట్టణంలో కార్పొరేట్‌ తరహాలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మండల కేంద్రాల్లోనూ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. సోషల్‌ మీడియాకు సంబంధించిన బృందాలతో జోరుగా ప్రచారాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు ఇరు వర్గాల మధ్య గొడవలూ జరుగుతున్నాయి.

పీసీసీ అధ్యక్షుడి అండతో..
వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి మొదటి నుంచి పీసీసీ రేవంత్‌రెడ్డిని నమ్ముకున్నారు. రేవంత్‌రెడ్డి వెంట నడుస్తు న్న తనకే టికెట్టు వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. రేవంత్‌రెడ్డి నిర్వహించిన హథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర సందర్భంగా ఎల్లారెడ్డి టికెట్టును జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ నిర్ణయిస్తారని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న సుభాష్‌రెడ్డి టికెట్టు తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు.

అనుచరుల్లో అయోమయం
ఇద్దరు నేతల అనుచరులు టికెట్టు విషయంలో టెన్షన్‌లో ఉన్నారు. సుభాష్‌రెడ్డికే అభ్యర్థిత్వం దక్కుతుందని ఆయన అనుచరులు.. కాదు మదన్‌మోహన్‌రావుకే అవకాశం వస్తుందని ఇయన అనుచరులు న మ్మకంతో ఉన్నారు. అయితే అధిష్టానం ఏం చేస్తుందోనని ఇరు వర్గాల్లోనూ ఆందోళన నెలకొంది. ఇద్దరు నేతలు టికెట్టు కోసం కొట్లాడుతున్న సమయంలో మధ్యేమార్గంగా మూడో వ్యక్తిని తెరపైకి తెస్తారా అన్న అంశంపైనా చర్చించుకుంటున్నారు.

అగ్రనేతను నమ్ముకున్న మదన్‌మోహన్‌రావు
కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌ గాంధీకి సంబంధించిన బృందంతో మదన్‌మోహన్‌రావు టచ్‌లో ఉన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్కలతోనూ మంచి సంబంధాలున్నాయి. నియోజకవర్గంలో ఎవరి బలం ఎంత ఉందో సర్వేల్లో తేలుతుందని మదన్‌మోహన్‌రావు వర్గం చెబుతోంది. గెలుపు గుర్రాలకే టికెట్టు ఇస్తారని, సర్వేలను పరిగణనలోకి తీసుకుని తనకే టికెట్టు కేటాయిస్తారని మదన్‌మోహన్‌రావు ఆశతో ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీలో కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆశావహులనుంచి దరఖాస్తులు స్వీకరించిన పార్టీ.. వాటిని పరిశీలిస్తోంది. జిల్లాలో ఎల్లారెడ్డి టికెట్టును ఇద్దరు బలమైన అభ్యర్థులు ఆశిస్తుండడంతో ఈ స్థానంపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. టికెట్టు ఎవరిని వరిస్తుందా అన్న అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

‘ఇక్కడి నుంచే పోటీ చేస్తా’
ఎల్లారెడ్డిరూరల్‌: తాను ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానంనుంచే పోటీ చేస్తానని పీసీసీ ఉపాధ్యక్షుడు మదన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. బాన్సువాడ నుంచి కానీ, జహీరాబాద్‌ ఎంపీ స్థానంనుంచి కాని పోటీ చేయబోనని స్పష్టం చేశారు. శుక్రవారం ఎల్లారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో గాంధారి మండలం తిప్పారం సర్పంచ్‌ సాయిలు, లింగంపేట్‌ మండలం ఒంటరిపల్లి సర్పంచ్‌ రాజయ్య, ఎల్లారం స ర్పంచ్‌ లక్ష్మితోపాటు పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ నుంచి గెలిచి అభివృద్ధి పేరిట బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే సురేందర్‌ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ఏనుగు రవీందర్‌రెడ్డి సైతం ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. పార్టీ టికెట్టు ఇస్తే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుస్తానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

నేడు జాబ్‌ మేళా..
ఎల్లారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో శనివారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు మదన్‌మోహన్‌రావు తెలిపారు. నిరుద్యోగ యువత సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. మల్టీ నేషనల్‌ కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన కోసం నిర్వహించే మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు చెన్న లక్ష్మణ్‌, ఆరిఫ్‌, తూర్పు రాజు తదితరులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement