కామారెడ్డి క్రైం: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్న కమాండ్ కంట్రోల్ రూం ను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీటు బెల్టులను ధరించాలన్నారు. అతివేగం మంచిదికాదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని జాతీయ రహదారి ఎన్‌హెచ్ 44 వెంబడి(భిక్కనూరు నుంచి దగ్గి అటవీ ప్రాంతం వరకు) వాహనాల వేగాన్ని గంటకు 80 కిలో మీటర్లకు కుదించడం జరిగిందన్నారు. అంతకుమించి ఎవరైనా వాహనాలు వేగంగా నడిపితే జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు.
అతిక్రమిస్తే చర్యలు తప్పవు
ఎస్పీ రాజేష్ చంద్ర
ధర్నా చౌక్ పరిశీలన
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పరిసరాలను ఎస్పీ రాజేశ్‌చంద్ర పరిశీలించారు. ధర్నా చౌక్, కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్‌ఐ రాజు పాల్గొన్నారు.