
రైతులందరికి భూధార్ కార్డులిస్తాం
భిక్కనూరు/రామారెడ్డి : భూ భారతి చట్టం అమలులోకి వచ్చిన వెంటనే రైతులందరికీ భూధార్ యునిక్ కార్డులను పంపిణీ చేస్తామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం భిక్కనూరు రైతు వేదికలో, రామారెడ్డి రైతు వేదికలలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులలో ఆయన మాట్లాడారు. లింగంపేట మండలంలో పైలట్ ప్రాజెక్టుగా భూభారతిని అమలు చేస్తున్నామన్నారు. జూన్ రెండు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ చట్టం అమలులోకి వస్తుందన్నారు. ర్యాగట్లపల్లికి చెందిన రైతు నరేందర్‌రెడ్డి, భిక్కనూరుకు చెందిన రైతు అందె దయాకర్‌రెడ్డి, తిప్పాపూర్‌కు చెందిన రైతు కుంట లింగారెడ్డి ధరిణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కోసమే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయసంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, ఆర్డీవో వీణ, భిక్కనూరు, రామారెడ్డి తహసీల్దార్లు శివప్రసాద్, ఉమాలత, ఎంపీడీవోలు రాజ్‌కిరణ్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, భిక్కనూరు డిప్యూటీ తహసీల్దార్ రోజా తదితరులు పాల్గొన్నారు.