మాట్లాడుతున్న పాడి కౌశిక్‌రెడ్డి
జమ్మికుంట(హుజూరాబాద్): ప్రజా వైద్యానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్రంలోని 30 జిల్లాలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో రూ.కోట్ల వ్యయంతో అధునాతన భవనాలు నిర్మించి వైద్య సేవలు అందిస్తున్నారని వివరించారు.
వైద్యులు దైవంతో సమానమని, పేద ప్రజలను సేవలతో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైద్యులు, సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు అండగా ఉంటామన్నారు. ముందుగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ఫంక్షన్ హాల్ వరకు వైద్య సిబ్బంది బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్లు తక్కళ్ళపెల్లి రాజేశ్వర్‌రావు, గందే రాధిక, వైస్ చైర్‌పర్సన్ దేశిని స్వప్నకోటి, ఆర్డీవో హరిసింగ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో చందు, జెడ్పిటీసీ డాక్టర్ శ్రీరామ్‌శ్యాం, పీఏసీఎస్ చైర్మన్లు పొనగంటి సంపత్, కోండల్‌రెడ్డి, హుజురాబాద్, వీణవంక ఎంపీపీలు రాణి, ముసిపట్ల రేణుక, తహసీల్దార్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలు
హుజూరాబాద్: సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ వైద్య, ఆరోగ్యం విషయంలో దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని, అందుకే కార్పొరేట్‌కు దీటుగా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో పేద ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. బుధవారం ఏరియా ఆసుపత్రిలో చైల్డ్ కేర్ సెంటర్‌ను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు. హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ పట్టణాలకు దీటుగా అన్ని రకాల అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేసి సేవలు అందించడం జరుగుతుందన్నారు.
ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రం, ప్రత్యేక పిల్లల వార్డు, డెలివరీ విభాగం, జనరల్ పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆస్పత్రిలోని రోగులు, గర్భిణులు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గందె రాధిక, ఎంపీపీ ఇరుమల్ల రాణి, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డి, వైద్యులు శ్రీకాంత్‌రెడ్డి, నారాయణరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment