కరీంనగర్: ‘ఇందు మూలంగా మీకు తెలియచేయునది ఏమనగా.. మీ భవనం శిథిలావస్థలో ప్రమాదకరంగా ఉన్నదని గుర్తించడమైనది. కావున ఇంటిలో నివసించే వాళ్లు తక్షణమే ఖాళీ చేసి.. ఇల్లును కూల్చుకోమని.. మరమ్మతులు చేసుకోమని హెచ్చరించనైనది. లేని యెడల సెక్షన్ 182, మున్సిపల్ చట్టం 2019 ప్రకారం కూల్చివేసి చట్టరీత్యా చర్యలు తీసుకోబడును.’
ఇది వర్షాలకు కూలిపోయే ప్రమాదం ఉన్న ఇళ్లకు నగరపాలకసంస్థ అంటిస్తున్న హెచ్చరిక నోటీ సు. తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని శిథిలావస్థలో (కూలడానికి సిద్ధంగా) ఉన్న ఇళ్లపై నగరపాలకసంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. పురాతన నిర్మాణాలతో ప్రమాదాలు పొంచి ఉన్నందున ముందు జాగ్రత్తగా ప్రజలను అప్రమత్తం చేస్తోంది. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చివేసుకోవాలని లేదంటే మరమ్మతులు చేసుకోవాలని నోటీసులు జారీ చేస్తోంది.
57 ఇళ్లకు హెచ్చరిక నోటీసు
వర్షాలతో కూలే ప్రమాదం ఉన్న ఇళ్లను మూడురోజులుగా గుర్తించే పనిలో నగరపాలకసంస్థ అధికా రులు బిజీగా ఉన్నారు. గురువారం నాటికి ఇలాంటి పడిపోయే 57 ఇళ్లను టౌన్‌ప్లానింగ్ అధికారులు గుర్తించారు. యజమానులకు నోటీసులు జారీ చేశా రు. కార్ఖానగడ్డ, సాయినగర్ తదితర ప్రాంతాల్లో గుర్తించిన ఇండ్లను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో తాత్కాలికంగా బసకోసం తరలాలని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వర్షాలకు కూలే ప్రమాదం ఉండడంతో ముందుగానే ఇండ్లను స్వచ్ఛందంగా కూల్చుకోవాలని, మరమ్మతులు చేసుకోవాలని సూచించారు.
స్పెషల్ టీమ్స్ ఆన్ డ్యూటీ
మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో అప్రమత్తమైన నగరపాలకసంస్థ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడం తెలిసిందే. ఎనిమిది గంటలకు ఒక బృందం చొప్పున మూడు విడుతలుగా 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయి. నగరంలో ఎక్కడ వర్షపు నీళ్లు నిలిచినా, డ్రైనేజీలు పూడుకుపోయినా, చెట్లు విరిగి పడిపోయినా ఈబృందాలు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాయి.
కట్టరాంపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో విరిగిన చెట్లను రెస్క్యూ టీం గురువారం తొలగించింది. నగరంలోని ప్రధాన రహదారుల నుంచి డ్రైనేజీలకు వెళ్లే హోల్స్ మట్టి, చెత్తతో మూసుకుపోగా సిబ్బంది తొలగించారు. రోడ్లు, పల్లపు ప్రాంతాల్లో నిలుస్తున్న నీళ్లను డ్రైనేజీలకు వెళ్లేలా మళ్లిస్తున్నారు.
ప్రజల రక్షణే ముఖ్యం..
వర్షాలు కురుస్తున్న సమయంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు తొలగించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాంటి గృహ యజమానులకు నచ్చచెప్పి తొలగిస్తాం. పురాతన ఇండ్ల సమాచారాన్ని అధికారులకు ఇవ్వాలి. రెస్క్యూ టీం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సహకరించాలి. – మేయర్ యాదగిరి సునీల్‌రావు
Comments
Please login to add a commentAdd a comment