‘తమ్మీ మీ ఊళ్లో గాలి ఎటు వీస్తుంది? ఓటర్లు ఏమనుకుంటున్నరు? మనమీద ఎవైరైనా నారాజ్‌గా ఉన్నార? ఉంటే చెప్పు. వాళ్లను మనవైపు తిప్పుకోవాలంటే ఏంచేయాలో చెప్పు. వారికి ఏం కావాలో తెలుసుకుని చెప్తే అన్నీసెట్ చేద్దాం. వాళ్ల కుల, యువజన సంఘం లీడర్లును పట్టుకుని నా దగ్గరికి తీస్కురా. వారితో సాయంత్రం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించు. దేనికీ తగ్గొద్దు. కచ్ఛితంగా మనం గెలవాలె’ అని ప్రధాన పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలతో ఎర వేస్తున్నారు.
ఒక్కో పోలింగ్ కేంద్రంలో 800 నుంచి 1,000మంది వరకు ఓటర్లు ఉంటారు. 800మంది ఉంటే అందులో 350మందిని తమవైపు తిప్పుకుంటే గెలుపొందవచ్చు. ఇప్పటికే నియమించిన బూత్ కమిటీలను యాక్టివ్ చేసిన నేత.. వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారు ఎందరు? తమ పార్టీ ఎవరు? పక్క పార్టీ వారికి ఓట్లు వేసేవారు ఎవరు? తటస్థ ఓటర్లు ఎవరు? అనే వివరాలు సేకరిస్తున్నారు. అందులోంచి ఎంపిక చేసుకున్న 350మందికి పోలింగ్ ముందు రోజు నోటు చేరేలా పకడ్బదీ ప్రణాళిక రచిస్తున్నారు. 60మంది ఓటర్లకు ఓ ఇన్‌చార్జిని నియమించి, రోజూ వారిని కలిసి తమ పార్టీకే ఓటు వేయాలని అభ్యర్థించేలా ప్రచారం చేస్తున్నారు. ఇలా ప్రచారం చేసే బూత్‌స్థాయి నాయకులకు ధావత్ కింద రూ.5వేలు ముట్టజెబుతున్నారు.
సాక్షి, పెద్దపల్లి: ఆత్మీయ సమ్మేళనాలు, ఇంటింటా ప్రచారాలు, భారీ బహిరంగ సభలతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. నిన్నామొన్నటి దాకా చేరికలకు ప్రాధాన్యం ఇచ్చిన నేతలు.. ప్రచారానికి మూడు రోజుల గడువే ఉండడంతో పోలింగ్ కేంద్రాల వారీగా లెక్కలు తీస్తూ గుంపగుత్తగా ఓట్లు రాబట్టేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టు సాధించేందుకు అ నుచరులతో కలిసి వ్యూహాలు అమలు చేస్తున్నారు.
వివిధ వర్గాలతో ఆత్మీయ సమావేశాలు
ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే బూత్‌స్థాయిలో మద్యం ఏరులై పారుతోంది. కుల, యువజన సంఘాలు, ఆర్‌ఎంపీలు, లారీ అసోసియేషన్‌లు, ఆటో డ్రైవర్లు, పింఛన్‌దారులు, కార్మికులు.. ఇలా ప్రతీ సంఘాన్ని ప్రసన్నం చేసుకునేలా కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆయా వర్గాలతో ఆత్మీ య సమావేశాలు నిర్వహిస్తున్నారు. కోరుకున్న వారికి ప్రత్యేక పార్టీలు ఇస్తూ పోలింగ్ నాటికి అంతా చక్కబెట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి
సభలు, ర్యాలీలు, ప్రచారం ఎలా కొనసాగినా.. ప్రచార సమయం ముగిసిన తర్వాత పోల్ మెనేజ్‌మెంట్ ఎన్నికల్లో విజయానికి కీలకం. ఉమ్మడి జిల్లాలో గత ఎన్నికల్లో కొందరు నేతలు ప్రచారం ఎలా నిర్వహించినా.. పోల్ మేనేజ్‌మెంట్ పక్కాగా అమలుచేసి విజయం సాధించారు. మరికొందరు ప్రచా రం హోరెత్తించి పోల్ మేనేజ్‌మెంట్‌లో విఫలమై ఓడిన సందర్భాలు ఉన్నాయి. గత అనుభవాలతో అన్నిపార్టీల నేతలు ఓటరుకు తాయిలాలు నేరుగా అందించటంతోపాటు, పోలింగ్‌కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించే దాకా పక్కా ప్రణాళికతో అప్రమత్తంగా ఉంటున్నారు. ఇవన్నీ సాఫీగా సాగేలా కమిటీలు నియమించి, నమ్మకమైన నేతలు, బంధువులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment