జాతీయ కరాటే పోటీలు ప్రారంభం
కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్‌లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు మెమోరియల్ కప్–2024 జాతీయ కరాటే పోటీలను శుక్రవారం కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, సినీ నటుడు సుమన్ ప్రారంభించారు. సుమన్ మాట్లాడుతూ.. చిన్న పిల్లలపైనా అఘాయిత్యాలు జరుగుతున్నాయని, విద్యార్థినులు, యువతులు కరాటే నేర్చుకొని, ఆకతాయిలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. శ్యామలాదేవి మాట్లాడుతూ.. కరాటే మానసికోల్లాసం, ఆత్మవిశ్వాసానికి దోహదం చేస్తుందని తెలిపారు. అమ్మాయిలు తమను తాము రక్షించుకునేందుకు తప్పకుండా కరాటే నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఎస్‌కేఐ చైర్మన్, కరాటే సంఘం జిల్లా అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, ఒలింపిక్స్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, చైర్మన్ వసంతకుమార్, రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్, సాయికుమార్, ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, నిర్వాహకుడు శ్రీనివాస్, సీనియర్ మాస్టర్ సురభి వేణుగోపాల్, ప్రవీణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment