స్టీరింగ్ వదిలిపెట్టిన డ్రైవర్.. కల్వర్టును ఢీకొన్న కారు
దంపతులతోపాటు మరో వ్యక్తి దుర్మరణం
ఆరుగురికి తీవ్రగాయాలు
మాఘమాసం పుణ్యస్నానాలకు కాళేశ్వరం వెళ్తుండగా..కాట్నపల్లి వద్ద ఘటన
మృతులు సిద్దిపేట జిల్లావాసులు
సుల్తానాబాద్‌రూరల్: డ్రైవర్ నిద్రమత్తు ముగ్గురు ప్రాణాలు తీసింది. మరోఆరుగురిని తీవ్రంగా గాయపర్చింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద రాజీవ్ రహదారిపై బుధవారం వేకువజామున 5.30గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో భార్యాభర్తలు ఆకుల కనుకయ్య(69), తార(62) అక్కడిక్కడే మృతి చెందారు. కనుకయ్య వియ్యంకుడు జనార్దన్(62) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోన శ్రీనగర్‌కాలనీకి చెందిన ఆకుల కనుకయ్య మేసీ్త్ర పని చేస్తూ కుటుంబాన్ని సాకుతున్నాడు.
మాఘమాసం సందర్భంగా కాళేశ్వరంలోని త్రివేణి సంగంమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఓ ప్రైవేట్ కారును అద్దెకు తీసుకున్నారు. అందులో భార్య తార, వీరి పెద్దకుమారుడు శ్రీనివాస్(40), మనుమలు అభిత్(10), మాన్విత్(04), శ్రీనివాస్ అత్తమామ సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం గొనెపల్లి గ్రామానికి చెందిన జనార్దన్ –రమాదేవి(60), బావమరిది మనోజ్‌కుమార్(30)తో కలిసి సిద్దిపేటలో బుధవారం వేకువజమాను బయల్దేరారు. వారు కాట్నపల్లికి చేరుకోగా.. నిద్రమత్తులోకి వెళ్లిన డ్రైవర్ బాల్‌రెడ్డి.. ఒక్కసారిగా స్టీరింగ్ వదిలిపెట్టాడు. దీంతో వేగంగా ఉన్న వాహనం కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు కనుకయ్య, తార అక్కడిక్కడే దుర్మరణం చెందారు.
గాయపడిన వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జనార్దన్ మృతి చెందాడు. డ్రైవర్‌తోపాటు శ్రీనివాస్, అభిత్, మాన్విత్, రమాదేవి, మనోజ్‌కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కనుకయ్య చిన్న కుమారుడు రాజేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వివరించారు. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి కరీంనగర్‌కు వెళ్లి ప్రమాద వివరాలపై ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment