సిద్దిపేటలో బలవంతంగా కలిపారన్న మంత్రి పొన్నం ప్రభాకర్
చర్చకు దారితీస్తున్న అమాత్యుని వ్యాఖ్యలు
సాక్షి, సిద్దిపేట: హుస్నాబాద్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా కేడం లింగమూర్తి గురువారం ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలను సిద్దిపేట జిల్లాలో బలవంతంగా కలిపారని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతో కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ కలవనుందా? అని పలువురు చర్చించుకుంటున్నారు.
హుస్నాబాద్.. మూడు జిల్లాల పరిధి
హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉంది. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలు సిద్దిపేట జిల్లాలో, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు హనుమకొండ జిల్లాలో, చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్నాయి. అప్పట్లో కరీంనగర్ జిల్లా నుంచి తమను వేరు చేయడంపై హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల ప్రజలు ఆందోళనలు చేశారు. వీటిని కరీంనగర్ జిల్లాలో కలుపుతామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. అలాగే, గతంలో పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హుస్నాబాద్‌ను కరీంనగర్‌లో కలుపుతామని సీఎం రేవంత్‌రెడ్డి సైతం హామీ ఇచ్చారు.
బెజ్జంకిలో ఉద్యమం..
బెజ్జంకి మండలాన్ని సైతం కరీంనగర్‌లో కలపాలని కరీంనగర్ సాధన సమితి పేరుతో అక్కడి ప్రజ లు ఉద్యమిస్తున్నారు. ఇటీవల మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని మూడు మండలాలు కరీంనగర్‌లో కలిపేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment