పారిశుధ్య కార్మికులు ఎక్కడ?
● కలెక్టర్ ఆదేశంతో కదులుతున్న డొంక
● బల్దియాలో తేలనున్న పాత లెక్కలు
‘మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ఏం జరుగుతుందో నాకు తెలుసు. మొత్తం షఫ్లింగ్ కావాల్సిందే. శానిటేషన్ లేబర్ ఎక్కడెక్కడ ఉన్నారో రిపోర్ట్ ఇవ్వండి’.. ఇటీవల నగరపాలకసంస్థ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ బల్దియాలో పాలకవర్గం పదవీకాలం ముగిసి, ప్రత్యేక అధికారి పాల న రావడంతో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. కలెక్టర్‌గా నగరపాలకసంస్థ వ్యవహారాల పై ఇప్పటికే అవగాహన ఉన్న పమేలా సత్పతి, ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టాక చక్కదిద్దే పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా శానిటేషన్ విభాగానికి సంబంధించి వస్తున్న ఆనేక ఆరోపణలపై ప్రత్యేక దృష్టి సారించారు. నగరపాలకసంస్థలో పారిశుధ్య కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో నివేదికివ్వాలని ఆదేశించడంతో డొంక కదులుతోంది.
ఎక్కడెక్కడో..
నగరంలో నిత్యం చేపట్టాల్సిన పారిశుధ్య పనుల కోసం నగరపాలకసంస్థలో 1,020 మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. ఇందులో చాలా మంది క్షేత్రస్థాయిలో కాకుండా అధికారులు, మాజీ కార్పొరేటర్ల ఇళ్లలో, వాహనాలపై వ్యక్తిగత అవసరాల కోసం పనిచేస్తున్నారు. ఉన్న సంఖ్యలో సగం మంది కార్మికులు మాత్రమే క్షేత్రస్థాయిలో పనులు చేపడుతుండడంతో నగరంలో తరచూ పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సంవత్సరాలుగా ఈ తంతు సాగుతున్నా, చర్యలు మాత్రం ఇప్పటివరకు తీసుకోలేదు. ఇదిలా ఉంటే కొంతమంది కాగితాల్లో తప్ప ఎక్కడా కనిపించరనే ఆరోపణలున్నాయి. వారి పేరిట జీతాలు వెళ్తుంటాయి తప్ప, వారు మాత్రం కనిపించరనేది నగరపాలకలో వినికిడి.
బయటకు రానున్న పాత లెక్కలు
పారిశుధ్య కార్మికులపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించడంతో పాత లెక్కలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. కాగితాల్లో మాత్రమే ఉండే కార్మికుల వివరాలు ఎలా ఇస్తారనే ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా మాజీకార్పొరేటర్ల ఇళ్లు, వాహనాలపై పనిచేస్తున్న కార్మికులు కూడా బయటకు రానున్నారు. అనధికారికంగా ఇళ్లలో పనిచేస్తున్న వారి లెక్కలు బయటపడే అవకాశం ఉండడంతో, అధికారులు ఇచ్చే నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎక్కడెక్కడో అనధికారికంగా ఉన్న పారిశుధ్య కార్మికులంతా నగరపాలకసంస్థ కార్యాలయానికి క్యూ కడుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment